భద్రాద్రి రామయ్య భూముల వివాద పరిష్కారానికి చొరవ తీసుకుంటాం : శ్రీనివాసానంద సరస్వతి

భద్రాద్రి రామయ్య భూముల వివాద పరిష్కారానికి చొరవ తీసుకుంటాం : శ్రీనివాసానంద సరస్వతి

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రామయ్య భూముల వివాద పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, ఏపీ సాధుపరిషత్​ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు వెల్లడించారు. భద్రాచలంలో గురువారం సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులతో తొలుత వీరు సమావేశమై ఏపీలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల అన్యాక్రాంతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఈవోలు, ఈఈ పూర్తి  వివరాలు వారికి వివరించారు.

 పురుషోత్తపట్నంలో భూముల ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన క్రమంలో దేవస్థానం సిబ్బందిపై జరుగుతున్న దాడుల విషయాన్ని కూడా తెలిపారు. కోర్టుల నుంచి వచ్చిన ఉత్తర్వులు పరిశీలించారు. పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లి రైతులతో చర్చలు జరిపారు. ఆక్రమణల పేరుతో తమను వేధిస్తున్నారంటూ రైతులు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా వీటిని సాగు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇదే సమయంలో వ్యవసాయం చేసుకునే రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. 

ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, ఏపీ సాధుపరిషత్​ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ దేవస్థానం భూముల సమస్యల మూలాలను కనుగొంటామన్నారు. నిజనిర్ధారణ చేసేందుకే వచ్చినట్లుగా వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గించి, సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్టాండింగ్​ కమిటీని ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల సీఎం వద్దకు భద్రాద్రి రామయ్య భూముల వివాదం తీసుకెళ్లి, పరిష్కారం కోరుతామన్నారు. ఇరు రాష్ట్రాల ఎండోమెంట్​ ఆఫీసర్లకు సైతం సమస్య వివరించి, వివాదానికి చెక్​ పెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు.