
- అన్ని రంగాల అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం కృషి
- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం
- పలుచోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ.. అభివృద్ధి పనుల ప్రారంభం
ఇల్లెందు/అశ్వారావుపేట/సత్తుపల్లి/పెనుబల్లి/కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గౌరవం, రైతుకు మద్దతు, యువతకు అవకాశాలు ఇస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క అన్నారు. గురువారం ఇల్లెందు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు, రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని 346 స్వయం సహాయక సంఘాలకు -రూ.28.75 కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు, 5,995 స్వయం సహాయక సంఘాలకు -రూ.4.85 కోట్ల వడ్డీలేని రుణాలు, లోన్ బీమా, ప్రమాద బీమా 21 మంది సభ్యులకు -రూ.19,84,317 చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పొందిన ఆడబిడ్డల కళ్ళలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు పావల వడ్డీ పథకాన్ని రద్దు చేసి, మహిళలకు ఆర్థికంగా కుదేలయ్యేలా చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గత 18 నెలల్లో 856 కోట్ల వడ్డీ మాఫీ చేసి లక్షలాది మహిళలను తిరిగి భరోసా కలిగే స్థితికి తీసుకొచ్చిందని వివరించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 'కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి' అనే ఆలోచన కేవలం హామీ కాదు అది కార్యరూపం దాల్చుతోందని చెప్పారు. సీతక్క మట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి సమాజాభివృద్ధికి నిజమైన బలమన్నారు. 'ఇందిరా మహిళా శక్తి' పథకం తెలంగాణ మహిళలకు ఆర్థికంగా స్వావలంబనకు మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు.
భద్రాచలం మహిళలు తయారుచేసిన రాగిలడ్డును ప్రధానమంత్రి పొగడడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. మంత్రుల వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అడిషనల్కలెక్టర్ డి. వేణుగోపాల్, మహబూబాబాద్ జిల్లా డీఆర్డీవో మధుసూదన్ రాజు, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు తదితరులు ఉన్నారు.
పలు మండలాల్లో పొంగులేటి పర్యటన
- ‘హలో గుడ్ మార్నింగ్’ కార్యక్రమంలో భాగంగా గురువారం అశ్వారావుపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. దొంతికుంట చెరువును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎనిమిది మీటర్ల వెడల్పుతో రింగు బండ్ నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. బీసీ గురుకుల బాలుర, బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నారంవారిగూడెం ఆయిల్ పామ్ గెస్ట్ హౌస్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు.
- పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్లలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదుట పడ్డాక మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతుల భూ సమస్యలు, సర్టిఫికెట్ల జారీ పై అలసత్వం వహిస్తే సహించేది లేదని తహసీల్దార్ తో అన్నారు.
- సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోనే 5.60 లక్షల కొత్త రేషన్ కార్డ్ లు, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ దయానంద్ విజ్ఞప్తి మేరకు త్వరలో ఇందిరా మహిళ శక్తి భవనాన్ని మంజూరు చేస్తామన్నారు.
- కూసుమంచి మండల కేంద్రంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తో కలిసి మంత్రి పాలేరు నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీఈమా చెక్కులు, ఇందిరమ్మ ఇండ్లలబ్ధిదారులకు ఇండ్ల ప్రొసిడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.