పాలమూరులోనే 10 వేల కోట్ల చేప పిల్లల ఉత్పత్తి .. వనపర్తి దిశ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరులోనే 10 వేల కోట్ల చేప పిల్లల ఉత్పత్తి .. వనపర్తి దిశ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 18 ‌‌ఎకరాల కృష్ణా పరివాహక ప్రాంతం ఉండగా చేపపిల్లల ఉత్పత్తి గురించి గత బీఆర్​ఎస్​ సర్కార్ ఎందుకు ఆలోచించలేదని  మత్స్యశాఖ, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు.  తెలంగాణలోని కృష్ణాపరివాహక ప్రాంతంలో 10వేల కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని మంత్రి శ్రీహరి అన్నారు.  ఒక్క వనపర్తి జిల్లాలో 2  కోట్ల చేపపిల్లలు అవసరముంటే స్థానికంగా కోయిల్​సాగర్ వద్ద కేవలం 20 లక్షల పిల్లలనే ఉత్పత్తి చేస్తున్నారన్నారు. 

 మిగతా 1.80 కోట్లు బయటి నుంచి తీసుకుంటున్నామన్నారు. అవి సంపూర్ణంగా పెరగక మత్స్యకార్మికులు నష్టపోతున్నారన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్​ చేపపిల్లల ఉత్పత్తి గురించి పట్టించుకోలేదన్నారు.  ఆంధ్రప్రదేశ్​లోని వ్యాపారులకు టెండర్లు ఇచ్చి వారికి దాసోహమందని మండిపడ్డారు. వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలోని కృష్ణాపరివాహకంలోనే  చేప పిల్లలను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తామని దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఫిజరీస్​ డిపార్టుమెంటు ఆఫీసర్లను ఆదేశించారు.    మిల్క్​ సెంటర్​ను డెవలప్​ చేయాలని, ఇప్పుడున్న 60వేల లీటర్ల పాల సేకరణను పెంచాలని ఆదేశించారు. 

క్రీడలకు సంబంధించి వనపర్తి జిల్లాలో టర్ఫ్​ మైదానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడలకు సంబంధించి నేషనల్​ ప్లేయర్స్​ను తయారు చేసి తనకు ఇస్తే జిల్లాలో క్రీడల పరంగా ఏమి కావాలన్నా ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.  స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సవాయిగూడెం వద్ద అటవీశాఖకు సంబంధించి కాల్వ సమస్యను తీరుస్తానన్నారు.  ఇతర వివిధ శాఖల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.  

గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ తీసుకొస్తాం 

 ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గద్వాల -డోర్నకల్​ రైల్వే  లైనును తీసుకొస్తామన్నారు. అలంపూరు నియోజకవర్గంలోని పుల్లూరు నుంచి నాగర్​కర్నూలు, కల్వకుర్తి, దేవరకొండ వరకు నేషనల్​ హై వే రోడ్డు రానుందని పేర్కొన్నారు. మంత్రి హోదాలో జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంతరి వాకిటి శ్రీహరిని ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు పుష్పగుచ్చాలిచ్చి సన్మానించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి, జిల్లా కలెక్టర్​ ఆదర్శ్​ సురభి, డీసీసీబీ ఛైర్మన్​ విష్ణువర్ధన్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.