9వ సారి జాతీయ జెండా ఎగురవేయనున్న మోడీ

9వ సారి జాతీయ జెండా ఎగురవేయనున్న మోడీ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలకు దేశమంతా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. 76వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఢిల్లీ ఎర్రకోట ముస్తాబైంది. చారిత్రాత్మక ఎర్రకోటపై రేపు ప్రధాని నరేంద్ర మోడీ 9వ సారి జాతీయ జెండా ఎగరవేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు. వందేండ్ల స్వతంత్య్ర భారత్ లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమం పథకాలు, నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ఎర్రకోట దగ్గర జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సుమారు 7 వేల మందికి పైగా ముఖ్య అతిథులు హాజరు కానున్నారు. ఢిల్లీలో టైట్ సెక్యురిటీ ఏర్పాటు చేశారు అధికారులు.. ప్రధాని జెండా ఎగరవేసే రెడ్ ఫోర్ట్ ఏరియాలో 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు

ఎర్రకోట ఎంట్రీ దగ్గర ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వీఐపీలు వచ్చే మార్గంలో వెయ్యికి పైగా హై స్పెసిఫికేషన్ కెమెరాలు అమర్చారు. రెడ్ ఫోర్ట్ ఏరియాలో షాపులన్నీ క్లోజ్ చేయించారు పోలీసులు. DRDO అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థతో..డ్రోన్ల ద్వారా వచ్చే ముప్పులను పసిగట్టనున్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు డ్రోన్ల కదలికలను ప్రత్యేక టెక్నాలజీతో గుర్తించనున్నారు. అర్థరాత్రి నుంచి ఉదయం 10గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని ఢిల్లీ అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సెంట్రల్ ఫోర్స్ ను మోహరించారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. అనంతనాగ్, బారాముల్లా ప్రాంతాల్లో ఉగ్రకదలికలను పసిగట్టిన బలగాలు.. ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇండో-పాక్ సరిహద్దు వద్ద భద్రత పెంచారు అధికారులు. దేశంలో చొరబాట్లు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ హెచ్చరికతో బీఎస్ఎఫ్ అలర్ట్

దేశంలో విధ్వంసాలకు  ఉగ్రవాదులు కుట్రపన్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికతో బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ అలెర్ట్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. సిలిగురి, ఫుల్బారి ఏరియాలో సెంట్రల్ ఫోర్స్ మోహరించారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భూటాన్ సరిహద్దుల వెంట మోహరించిన బీఎస్ఎఫ్ సిబ్బంది.. చైనా కదలికలను పసిగడుతున్నారు. ఇటు పంజాబ్ లో భారీగా టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు గ్రెనేడ్లు, ఐఈడీ, 9MM పిస్టల్స్, 40 లైవ్ కాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు.