బడాబాబులకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రయత్నం : కోదండ రెడ్డి

బడాబాబులకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రయత్నం : కోదండ రెడ్డి
  • రైతులు, కార్మికులను హత్య చేసేలా వ్యవసాయ చట్టాలు: జగ్గారెడ్డి
  • ఈ నెల 16న ఇందిరాపార్క్​ వద్ద ధర్నాకు కిసాన్​ కాంగ్రెస్​ పిలుపు

హైదరాబాద్​, వెలుగు: నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను ప్రధాని మోదీ మోసం చేశారని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో రైతులు ఆందోళన చేయడంతో ఆ చట్టాలను వాపస్​ తీసుకుంటామని చెప్పిన మోదీ.. ఇప్పటికీ బిల్లులను వెనక్కు తీసుకోలేదని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్​లో కోదండ రెడ్డి అధ్యక్షతన కిసాన్​ కాంగ్రెస్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16న ఇందిరాపార్క్​ వద్ద  రైతు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ..

 అదానీ, అంబానీకి లాభం చేసేందుకే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని  విమర్శించారు. బడాబాబులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మద్దతు ధర ఇవ్వాలని, కేసులు ఎత్తేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారని పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని కేంద్రం పక్కన పెట్టిందన్నారు. మద్దతు ధర విషయంలో రైతుల సలహాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు, కార్మికులకు తీవ్ర నష్టం చేసేలా వ్యవసాయ చట్టాలున్నాయని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గా రెడ్డి అన్నారు. 

రైతులను కాపాడుకునేందుకు అందరూ సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్​ వద్ద ధర్నాకు మంత్రులు కూడా వస్తారని చెప్పారు. వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన అమలు చేసే కుట్రలు చేస్తున్నారని కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​ రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడాబాబులకు లబ్ధి చేకూర్చే పనిలో బీజేపీ నేతలున్నారన్నారు. హైదరాబాద్​లో భారీ ర్యాలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ రైతులకు అర్థమయ్యేలా నిరసన చేపట్టాలని, రైతులకు జరిగే నష్టాన్ని వివరించాలని విజ్ఞప్తి చేశారు.