ఐదేళ్ల పాపతో మోడీ ఆసక్తికర సంభాషణ

ఐదేళ్ల పాపతో మోడీ ఆసక్తికర సంభాషణ

న్యూఢిల్లీ: ఓ ఐదేళ్ల పాపతో మోడీ జరిపిన సంభాషణ అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే మోడీ... ఆ బాలిక చెప్పిన సమాధానం విని పడి పడి నవ్వుకున్నారు. ఇక విషయానికొస్తే... మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తన కుటుంబాన్ని తీసుకొని పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం తన  ఐదేళ్ల కూతురు అహానా ఫిరోజియాను తీసుకొని పీఎం మోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలోనే మోడీ అహానా ఫిరోజియాతో మాట్లాడారు.

మోడీ: నేనెవరో తెలుసా ?

అహానా : తెలుసు. మీరు మోడీ. మీరు రోజూ టీవీలో వస్తుంటారు.

మోడీ: నేను ఏం చేస్తానో తెలుసా?

అహానా : మీరు లోక్ సభలో పని చేస్తారు.

ఇలా ఆ పాప సమాధానం ఇవ్వడంతో  పీఎం చాంబర్ లో నవ్వులు పూశాయి. ఆ చిన్నారి ఆన్సర్ కు మురిసిపోయిన మోడీ... ఆమెకు చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇకపోతే...  ఎంపీ అనిల్ ఫిరోజియా తన శరీర బరువు తగ్గించుకొని ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల మధ్యప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ... తన శరీర బరువు తగ్గించుకుంటే తన నియోజకవర్గానికి కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తానని ఎంపీ అనిల్ ఫిరోజియాకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎంపీ అనిల్ ఫిరోజియా ఎంతో కష్టపడి కొద్దీ రోజుల్లోనే 21 కేజీల బరువు తగ్గారు. ఆ రకంగా అనిల్ ఫిరోజియా వార్తల్లో నిలిచారు. ఇక అహానా ఫిరోజియా కూడా తండ్రికి తగ్గ తనయ అన్నట్లుగా మోడీని నవ్వించి వార్తల్లో నిలిచింది.