మహమ్మద్ షమీ రాజకీయారంగేట్రం?: ఆ పార్టీ అధినేతతో భేటీ.. ఈ స్థానం నుంచే పోటీ!

మహమ్మద్ షమీ రాజకీయారంగేట్రం?: ఆ పార్టీ అధినేతతో భేటీ.. ఈ స్థానం నుంచే పోటీ!

Mohammed Shami: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ క్రికెట్ గ్రౌండ్ నుంచి పొలిటికల్ పిచ్‌పైకి అడుగు పెట్టబోతున్నారా? అంటే అవుననే ప్రచారం క్రీడా, రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. మార్చి 9, 2025న టీమిండియా తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన షమీ, చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరితో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 

జయంత్ చౌదరితో షమీ కీలక భేటీ: 

జయంత్ చౌదరితో షమీ భేటీ అయిన ఫోటోలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చ తీవ్రమైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా (Amroha) స్థానం నుంచి షమీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమ్రోహా షమీ సొంత జిల్లా కావడం, అక్కడ ఆయనకు భారీగా అభిమానులు ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

షమీ లేదా అతడి సోదరుడికి టికెట్: 

ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ ఆర్‌ఎల్‌డీ (BJP-RLD) కూటమికి ఈ సీటు కేటాయిస్తే, అక్కడి నుంచి పోటీ చేయడానికి మహమ్మద్ షమీ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ షమీ ప్రత్యక్షంగా పోటీకి దూరంగా ఉండాలని భావిస్తే, ఆయన సోదరుడు హసీబ్ అహ్మద్ (Hasib Ahmed) కు ఆ టికెట్ దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. షమీ తన సోదరుడి విజయం కోసం ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుంటారా లేక స్వయంగా రంగంలోకి దిగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై: 

భారత జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మహమ్మద్ షమీ, గాయాల కారణంగా గతేడాదిగా జట్టుకు దూరంగా ఉంటున్నారు. క్రికెట్ ఆడేందుకు ఇంకా అవకాశం ఉన్నప్పటికీ, అనూహ్యంగా రాజకీయ భేటీలు నిర్వహించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షమీ పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే అతడి కుటుంబం లేదా ఆర్‌ఎల్‌డీ వర్గాల నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.