
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని గాయాలు వేధిస్తున్నాయి. భారత టెస్ట్ జట్టులోకి రావడానికి ఎంతలా తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ ఈ పేసర్ కు ఏదీ కలిసి రావడం లేదు. గాయం నుంచి కోలుకొని ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన షమీ.. ఆ తర్వాత ఐపీఎల్ 2025 లో మరోసారి గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు షమీని ఎంపిక చేయలేదు. శనివారం (మే 24) ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమీకి చోటు దక్కకపోవడం షాకింగ్ కు గురి చేసింది.
అయితే షమీని ఇంగ్లాండ్ టూర్ కు ఎందుకు సెలక్ట్ చేయలేదా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు.
షమీ గురించి అగార్కర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. "గత వారం రోజులుగా షమీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. MRI స్కాన్ చేయించుకున్న తర్వాత అతను 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఫిట్ గా ఉండలేడ వైద్యులు చెప్పారు. టెస్ట్ సిరీస్ లో షమీ అనుభవం ఉపయోగపడుతుందని ఆశించాం. అతను ఫిట్ గా ఉంటే ఎంపిక చేద్దామని ఆశించాం. అతని కోసం ఎదురు చూడడం కంటే ఫిట్ గా అందుబాటులో ఉన్న వారిని ఎంచుకోవడమే ఉత్తమంగా అని భావించాం". అని అగార్కర్ అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో షమీ ఘోరంగా విఫలమయ్యాడు. సన్ రైజర్స్ తరపున 12 ఎకానమితో బౌలింగ్ చేసి జట్టుకు భారంగా మారాడు. ఐపీఎల్ లో ఫామ్ లేకపోవడం.. అదే సమయంలో గాయం షమీ కెరీర్ ను సందిగ్ధంలో పడేశాయి. భారత జట్టు తరపున షమీ మూడు ఫార్మాట్ లు ఆడుతున్నాడు. మేజర్ టోర్నీల్లో తప్పితే షమీని సెలక్ట్ చేయడం లేదు. 34 ఏళ్ళ షమీ ఇలా పడే పదే గాయాల బారిన పడితే త్వరలో టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. షమీ స్థానంలో అర్షదీప్ సింగ్ తొలి సారి టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ మరో ఐదుగురు పేసర్లు ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్ టూర్కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్
🚨BREAKING NEWS🚨: Mohammed Shami has been ruled out of the England tour due to an injury#MohammedShami #ENGvsIND pic.twitter.com/D14GLeSgeP
— CricTracker (@Cricketracker) May 24, 2025