షమీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు

షమీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు

భారత పేసర్ మహ్మద్ షమీ తల్లి అనుమ్‌ ఆరా అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఉన్న ఆమె.. ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ వీక్షిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మరో ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

"షమీ తల్లి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఉన్నట్టుండి ఆమె నిన్న మ్యాచ్‌ చూస్తూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దగ్గరకి వెళ్లి చూసేసరికి కాస్త భయం భయంగా కనిపించరు. వెంటనే ఆస్పత్రిలో చేర్చాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.." అని షమీ బంధువులు వెల్లడించారు.

7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు

తొలి నాలుగు మ్యాచ్‌ల్లో  బెంచ్‌కు పరిమితమైన షమీ.. పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాక  ఎంట్రీ ఇచ్చాడు. 7 మ్యాచ్‌ల్లో 10.70 సగటుతో 24 వికెట్లు పడగొట్టి  మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సెమీస్‌లో న్యూజిలాండ్ పై ఏడు వికెట్లు పడగొట్టి జట్టును ఒంటిచేత్తో  విజయాన్ని అందించాడు.