చిక్కుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ.. 15 లక్షల ఫైన్ కట్టాల్సొచ్చింది..!

చిక్కుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ.. 15 లక్షల ఫైన్ కట్టాల్సొచ్చింది..!

తిరుపతిలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది. ఈ ఎంక్వైరీలో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.15 లక్షల జరిమానాను మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు చేసింది. 

సీనియర్ నటుడు మోహన్ బాబు తన పేరుతో తిరుపతి జిల్లాలోని రంగంపేటలో యూనివర్సిటీని నడుపుతున్న సంగతి తెలిసిందే. అప్పటివరకూ శ్రీ విద్యా నికేతన్ పేరుతో ఈ మోహన్ బాబు విద్యా సంస్థలు ఉండేవి. 2022లో శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటిదాకా శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉండే సీట్లలో 70 శాతం, ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35  శాతం సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ  చేస్తూ వచ్చింది. ఈ సీట్లకు హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ ఫీజులను నిర్ణయించింది.

ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్‌ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉంది. కానీ.. మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఈ రూల్స్ను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులను వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారించిన ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించడంతో పాటు ఈ విద్యా సంస్థకు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సిఫారసు చేయడంతో మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ చిక్కుల్లో పడింది.