ఘట్ కేసర్, వెలుగు: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన స్వరఝరి ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
సంగీతంలో భారతీయీకరణను పెంపొందించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ పూర్తిగా భారతీయ రాగాలతోనే సంగీత రచన చేసిందని చెప్పారు. శివాజీ కాలంలోని అష్టభుజ, యుద్ధ నౌక తేజస్, విక్రమ్ ల్యాండర్, రోవర్, వ్యూహాలతో పాటు సంఘ్ కవాతు చేశారు. మోహన్ భాగవత్ తో ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, ఏఎం రత్నం, ఎల్లా వెంకటేశ్వర్ రావు, ఆర్పీ పట్నాయక్, కొమందూరి రామాచారి, కేఎం రాధాకృష్ణ, ఎంఎం శ్రీలేఖ, సంగీత విద్వాంసులు ప్రేమ రామ్మూర్తి, వేణు గాన విద్వాంసులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్లా బాల మురళి, వనజా ఉదయ్, డా. జయప్రదా రామమూర్తి, రమా ప్రభలతో పరిచయ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ సుందర్ రెడ్డి, భాగ్యనగర్ సంభాగ్ సంఘ్ చాలక్ కృష్ణ ప్రసాద్, స్థానిక బీజేపీ నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
