
ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ఈ రోజు (సెప్టెంబర్ 23, 2025) అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను స్వయంగా అందజేసి సత్కరించారు. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన ఈ అవార్డుల్లో బాలీవుడ్, దక్షిణాది చిత్రాలు తమ ప్రతిభను చాటుకున్నాయి.
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఈసారి తెలుగు సినిమాకు ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. ఈ అవార్డులన్నీ తెలుగు చిత్రసీమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కథా బలం, సాంకేతిక విలువలు, నటనలో మన సినిమా స్థాయి పెరుగుతోందని ఈ అవార్డులు నిరూపించాయి.
ఉత్తమ తెలుగు చిత్రం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సామాజిక సందేశంతో పాటు బాలకృష్ణ నటనకు ప్రశంసలు అందుకుంది.
ఉత్తమ బాల నటి: సుకుమార్ కుమార్తె సుకుృతి వేణి బండ్రెడ్డి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి ఉత్తమ బాల నటిగా ఎంపికై తన తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఆమె నటనకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
ఉత్తమ నేపథ్య గాయకుడు: ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా...’ పాటను అద్భుతంగా ఆలపించినందుకు గానూ పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకున్నారు.
ఉత్తమ మాటల రచయిత: సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ సినిమాకు సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా అవార్డును అందుకున్నారు.
ఉత్తమ గేయ రచయిత: ‘బలగం’ చిత్రంలోని హృదయాన్ని కదిలించే ‘ఊరు పల్లెటూరు’ పాటకుగానూ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
హను-మాన్ కి డబుల్ ధమాకా: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను-మాన్’ చిత్రానికి ఏకంగా రెండు అవార్డులు దక్కాయి. స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో నందు, పృథ్వీలకు, మరియు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో జెట్టి వెంకట్ కుమార్‌లకు ఈ అవార్డులు లభించాయి. తెలుగులో వచ్చిన తొలి సూపర్ హీరో చిత్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అద్భుతమనే చెప్పాలి.