
ఫాం హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. చీటింగ్ కేసుకు సంబంధించి విచారణ కోసం చంచల్ గూడ జైలు నుంచి ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టడీ చివరి రోజు కావడంతో నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. అక్రమ కట్టడాల ద్వారా సంపాదించిన డబ్బుపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.
ఫిలింనగర్ లోని హీరో దగ్గుబాటి రానా, సురేష్ బాబు భూమికి నందకుమార్ లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో జీహెచ్ఎంసీతో పాటు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కొద్ది రోజుల క్రితం కూల్చివేశారు. అక్రమ కట్టడాల ద్వారా వాటిని అద్దెకు ఇచ్చి చీటింగ్ చేశాడంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. నందు మోసంతో రూ.70లక్షలు నష్టపోయామని సయ్యద్ అయాబ్, సంజయ్ లు ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ స్థలాన్ని లీగల్ రైట్స్ లేకున్నా అగ్రిమెంట్ చేశాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే నందకుమార్ పై ఐపిసి సెక్షన్ 406, 420, 506 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.