అమ్మ, అక్క నన్ను క్షమించండి.. సూసైట్​ నోట్​ రాసి, మానసిక ఇబ్బందులతో యువతి మృతి

అమ్మ, అక్క నన్ను క్షమించండి..  సూసైట్​ నోట్​ రాసి, మానసిక ఇబ్బందులతో యువతి మృతి

మియాపూర్, వెలుగు: మానసికంగా ఇబ్బంది పడుతున్న ఓ యువతి అధిక మోతాదులో టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బీడీఎల్​లో ఉద్యోగం చేస్తున్న కె. విజయలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మియాపూర్​ దీప్తిశ్రీనగర్​కాలనీలో నివాసం ఉంటోంది. రెండేండ్లుగా విజయలక్ష్మి రెండో కుమార్తె వైశాలి(27) మానసిక సమస్యతో ఇబ్బంది పడుతోంది. 

బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన విజయలక్ష్మి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది. డోర్​లోపలి నుంచి లాక్​ చేసి ఉండడం, ఎంత పిలిచినా కుమార్తె డోర్​తీయకపోవడంతో తన వద్ద ఉన్న మరో తాళం చెవితో డోర్​ఓపెన్​చేసి లోపలికి వెళ్లింది. బెడ్రూంలో వైశాలి అపస్మారకస్థితిలో ఉండడం,  పక్కనే టాబ్లెట్ స్ట్రిప్ కన్పించడంతో హుటాహుటిన సమీప హాస్పిటల్​కు తరలించారు. 

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంతకాలంగా వైశాలి మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఈ క్రమంలోనే టాబ్లెట్లను ఎక్కువగా వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైశాలి ఆత్మహత్యకు ముందు సూసైట్​ నోట్​ రాసినట్లు పోలీసులు గుర్తించారు. 

‘అమ్మ, అక్క నన్ను క్షమించండి.. నా మానసిక పరిస్థితి బాగలేక, మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నా. అనుకున్నది సాధించలేకపోతున్నా’ అని నోట్​లో  రాసినట్లు పోలీసులు తెలిపారు.