మురుగు నీరు పారుతున్న రోడ్డుపై బైఠాయింపు .. ఈస్ట్ మారేడుపల్లిలో కార్పొరేటర్ నిరసన

మురుగు నీరు పారుతున్న రోడ్డుపై బైఠాయింపు .. ఈస్ట్ మారేడుపల్లిలో కార్పొరేటర్  నిరసన

పద్మారావునగర్, వెలుగు: ఏడాదిగా ఈస్ట్ మారేడుపల్లి అంబేద్కర్ నగర్ లో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మోండా మార్కెట్ కార్పొరేటర్​ కొంతం దీపిక ఆరోపించారు. మంగళవారం స్థానికులతో కలిసి మురుగు నీరు పారుతున్న రోడ్డుపైనే  బైఠాయించి, నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నోసార్లు వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, జీఎం వినోద్ కు  వినతిపత్రాలు ఇచ్చామన్నారు. 

స్థానిక కార్పొరేటర్ గా తాను నిధుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. అంబేద్కర్ నగర్ వాసుల ప్రాణాలకు విలువ లేదా.. వారు ఓటు వేయడానికే పనికొస్తారా అని ప్రశ్నించారు.  అంబేద్కర్ నగర్ నాయకులు చిన్న వీరయ్య, బాల నరసింహ, కోటయ్య, బాలు యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, కోటమ్మ, కుమారి, గణేశ్, నర్సింగ్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు జితు తదితరులు పాల్గొన్నారు.