టోకెన్ల రూపంలో డబ్బులు పంచుతున్నారు.. ఈసీకి కమల్ హాసన్ ఫిర్యాదు

టోకెన్ల రూపంలో డబ్బులు పంచుతున్నారు.. ఈసీకి కమల్ హాసన్ ఫిర్యాదు

చెన్నై: ఒక వైపు పోలింగ్ జరుగుతుంటే.. ఓట్లు వేసేందుకు వస్తున్న జనాలకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు టోకెన్ల రూపంలో డబ్బులు విచ్చలివిడిగా డబ్బులు పంచుతున్నారని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఆరోపించారు. తాను పోటీ చేస్తున్న దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలసి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతోపాటు తన పెద్ద కుమార్తె, సినీ నటి శృతిహాసన్ తో కలసి ఆయన ఎన్నికల అధికారిని కలిశారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి తరపు నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని, పోలీసుల తనిఖీల్లో పట్టుపడతామేమోనని ముందు జాగ్రత్తగా టోకెన్లు రూపంలో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సేకరించిన కొన్ని టోకెన్లను ఎన్నికల అధికారికి ఆయన చూపించారు. పోలింగ్ అయిపోయాక తమ వద్దకు వస్తే డబ్బులు ఇస్తామని.. చెబుతున్నారని కమల్ హాసన్ ఫిర్యాదు చేశారు. రెండు మూడు వీధులకు ఒకరిద్దరు కలసి ఓటర్ల వద్దకు వెళ్లి టోకెన్లు పంచుతున్నారని.. పోలీసుల తనిఖీలను బట్టి వారు రకరకాలుగా డబ్బులు వెదజల్లుతున్నారని కమల హాసన్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలను చూపి తాను ఆందోళన నిర్వహించే ఉద్దేశం లేదని.. అలాగే పోలింగ్ ఆపేయమని కోరబోనని చెప్పారు. వాస్తవ పరిస్థితులను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడమే తన ఉద్దేశమని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా.. స్వేచ్ఛగా జరపాలని కోరుకుంటున్నానని కమల్ హాసన్ చెప్పారు. తండ్రికి మద్దతుగా వచ్చిన శృతి హాసన్ మాట్లాడుతూ.. తన తండ్రి పై నమ్మకంతో అభిమానులు, జనం తమ పార్టీని గెలిపిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. పోలింగ్ సందర్భంగా కమల్ కు తోడుగా వచ్చిన శృతి హాసన్ ను చూసేందుకు పలు పోలింగ్ కేంద్రాల సమీపంలో అభిమానులు ఎగబడడంతో వారిని నివారించేందుకు పలుచోట్ల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.