డిజిటల్ అరెస్ట్పేరుతో డబ్బులు వసూలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

డిజిటల్ అరెస్ట్పేరుతో డబ్బులు వసూలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

మహబూబాబాద్, వెలుగు: పోలీసుల పేరుతో బంగారం వ్యాపారులను డిజిటల్ అరెస్ట్​ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్​ చేశారు. 

మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్  శబరీశ్  మాట్లాడుతూ నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్, చింతల రేవు ప్రశాంత్​ కలిసి డిజిటల్​ అరెస్ట్​ పేరుతో రూ.4.20 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇర్ఫాన్​ పోలీస్  యూనిఫామ్ తో ఫొటోలు తీసుకొని వాట్సాప్, ట్రూ కాలర్ లో డీపీగా పెట్టుకునేవాడు.

కేసముద్రం మండలానికి చెందిన బంగారం వ్యాపారి బోగోజు వేణుగోపాలచారికి ఇటీవల ఫోన్  చేసి నల్గొండలో ఇద్దరు దొంగలను అరెస్ట్​ చేశామని, వారు మీ పేర్లు చెప్పారని భయపెట్టారు. అరెస్ట్​ చేస్తామని భయపెట్టి వాట్సప్​కు క్యూఆర్  కోడ్  పంపించి  డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. 

సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించామని, వీరిద్దరు గతంలో ఏపీ, తెలంగాణలోని పలువురు బంగారం వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ తిరుపతి రావు, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్  పాల్గొన్నారు.