ప్లేట్​లెట్ల పేరుతో వేలల్లో గుంజుడు

ప్లేట్​లెట్ల పేరుతో వేలల్లో గుంజుడు

   లక్షల మందికి వైరల్ ఫీవర్‌‌.. 50 వేల మందికి డెంగీ!

    జూన్ నుంచి పేషెంట్లతో దవాఖాన్ల కిటకిట

    30 వేల నుంచి లక్ష వరకూ ఖర్చు

    చితికిపోతున్న చిన్నవ్యాపారులు, కూలీలు

    వంద మందికిపైగా మృతి!

రాష్ట్రమంతా డెంగీ ఫీవర్ పట్టుకుంది. దోమ కనిపిస్తే చాలు జనం బెంబేలెత్తుతున్నారు. ఒళ్లు వేడెక్కితే చాలు డెంగీ వచ్చిందేమోనని భయపడుతున్నరు. డెంగీతో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడంతో, జ్వరం రాగానే హాస్పిటల్‌‌కు పరుగులు తీస్తున్నారు. జూన్‌‌ నుంచి ఇప్పటివరకూ దవాఖాన్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లలోనూ బెడ్ల కొరత ఏర్పడిందంటే ఎన్ని లక్షల మంది జ్వరాల బారిన పడ్డారో అర్థం చేసుకోవచ్చు. తమకు ‘సీజన్’ కావడంతో ఆస్పత్రలులు దొరికిన కాడికి దోచుకుంటున్నాయి. దీంతో జనాలు దవాఖాన్లకు రూ.కోట్లు సమర్పించుకున్నారు. వంద మందికిపైగా డెంగీతో ప్రాణాలు కోల్పోయారు.

కాస్త తగ్గగానే ఇన్​పేషెంట్లుగా..

ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని హాస్పిటళ్లు ప్లేట్‌‌లెట్‌‌ కౌంట్ కాస్త తగ్గగానే ఇన్‌‌పేషెంట్లుగా చేర్చుకుంటున్నాయి. ఇన్‌‌పేషెంట్‌‌గా వారం రోజులు ఉంటే దవాఖాన బిల్లు తడిసి మోపడైతాంది. చిన్న నర్సింగ్ హోమ్‌‌ అయినా బెడ్ చార్జ్‌‌ రోజుకు 3 వేలు వేస్తున్నారు. డయాగ్నస్టిక్స్‌‌, మెడిసిన్ ఖర్చు కలుపుకుంటే వారం రోజుల బిల్లు కనీసం రూ.30 వేలు దాటుతోంది. ఇక ప్లేట్‌‌లెట్స్‌‌ ఎక్కించాల్సి వస్తే బిల్లు కనీసం రూ.50 వేలు అవుతోంది. పెద్ద దవాఖాన్లు, కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్తే కనీసం రూ.లక్ష అవుతోంది. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్లేట్‌‌లెట్ కౌంట్ 20 వేలకు తగ్గినా ప్రమాదమేమీ ఉండదు. కానీ కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లలో ప్లేట్‌‌లెట్స్‌‌ ఉండాల్సిన దానికంటే కొద్దిగ తగ్గినా పేషెంట్‌‌ను కంగారు పెడుతున్నారు. 50 వేల కంటే తగ్గిందంటే ఐసీయూకు షిఫ్ట్‌‌ చేస్తున్నారు. అవసరం లేకపోయినా ప్లేట్‌‌లెట్స్‌‌ ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

అప్పులే మిగిలినయ్‌‌

ఇప్పటికే డెంగీ ఉన్న వాళ్లను కుట్టిన దోమ, ఆరోగ్యవంతులను కుడితే వాళ్లకూ వైరస్ సోకుతుంది. దీనివల్లే ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు డెంగీ బారిన పడుతున్నారు. ఒక్కో కుటుంబం ఈ సీజన్‌‌లో దవాఖాన్లకే రూ.లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. డెంగీని బ్రేక్‌‌ బోన్ ఫీవర్‌‌‌‌ అని కూడా పిలుస్తారు. బొక్కలు విరిగినప్పటి మాదిరే నొప్పులు పెడుతయ్‌‌. ఈ నొప్పులు, అలసట తగ్గి పూర్తిగా కోలుకోవడానికి కనీసం 20 నుంచి నెల రోజుల పడుతోంది. దీంతో చిరువ్యాపారులు, దినసరి కూలీలు, సగటు వేతన జీవులు ఆర్థికంగా చితికిపోయారు. తాము కూడబెట్టింది దవాఖాన ఖర్చులకు సరిపోక అప్పుల పాలయ్యారు.

డెంగీ తగ్గుతలేదని టీచర్ సూసైడ్

బాచుపల్లి పీఎస్ పరిధిలో ఘటన

ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నా డెంగీ తగ్గడంలేదని, ఖర్చు ఎక్కువవుతోందనే మనస్థాపంతో ఓ స్కూల్​ టీచర్​ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం బాచుపల్లి పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుమ్మ సుష్మ(35), గాలి అనిల్(39) దంపతులు‌‌ ప్రగతినగర్ లో ఉంటున్నారు. సుష్మ ఓ గవర్నమెంట్ స్కూల్​లో టీచర్​గా పనిచేస్తోంది. వారం క్రితం సుష్మ తీవ్రజ్వరంతో స్థానిక ప్రగతి క్లినిక్​లో చేరింది. టెస్ట్​లు చేసిన డాక్టర్లు ఆమెకు ఆమెకు డెంగీ సోకిందని, ప్లేట్ లెట్స్ తగ్గాయని చెప్పారు. దీంతో సుష్మ అక్కడే ట్రీట్​మెంట్ తీసుకుంటోంది. ఆదివారం అర్ధరాత్రి సుష్మ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకుంది. ట్రీట్​మెంట్ కోసం పెద్దమొత్తంలో ఖర్చవుతోందని, అనారోగ్యం వల్ల ఇబ్బందులను ఎదుర్కోలేకపోతున్నానని లెటర్​లో పేర్కొందని పోలీసులు చెప్పారు. సుష్మ భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి