
- చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
అది చూడటానికి ఏదో వస్తువును పార్సిల్ చేసి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ.. అందులో వస్తువు ఉండదు. కట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయి. మూడో కంటికి తెలియకుండా నేరుగా చేరాల్సి న వ్యక్తికి డబ్బు చేరిపోతుంది. పోలీసులు కూడా గుర్తించలేరు. అంతా పక్కాగా సాగిపోతుంది. అదే హవాలా దందా. ప్రస్తుతం ఎన్నికల వేళ హవాలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఎన్నికల కమిషన్ నిఘా కళ్లుగప్పి ఓటర్లకు డబ్బును చేరవేసేందుకు కొందరు నాయకులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. హవాలా వ్యాపారాన్ని హుండీ దందా అని కూడా పిలుస్తారు. ఒక చోటి నుంచి మరో చోటికి లెక్కా పత్రం లేకుండా నగదు తరలించే విధానమే ఇది. ఎంత డబ్బు తీసుకున్నారో అవతల అంత డబ్బు చెల్లిస్తారు. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చేస్తారు. ఈదందాలో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినా ఎక్కడా రాతపూర్వక హామీ, గ్యారెంటీ అనే పదం మాత్రం వాడరు. మెసేజ్‌లు, కోడ్, వాట్సప్ ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు.
చేతికి మట్టంటకుండా…
ఎన్నికల్లో నేతల ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈసీ నిబంధనలు, వాటికి తోడు నిఘా పెరగడంతో డబ్బును ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం.. ఓటర్లకు చేరవేయడం నేతలకు సమస్యగా మారింది. దీంతో తమ చేతికి మట్టంటకుండా నేరుగా అనుకున్నవారికి డబ్బును చేరవేసే హవాలా మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు నాయకులకు విదేశాల నుంచి కూడా ఈ మార్గం లో డబ్బును తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతా పక్కాగా…
హవాలా దందాలో నమ్మకమే ప్రధానం. నమ్మకస్తులను, పరిచయస్తులనే డబ్బు తరలింపుకోసం ఉపయోగించుకుంటారు. పట్నం నుంచి పల్లె వరకు ఈ దందా అంతా ఒక చైన్ సిస్టమ్ మాదిరి సాగుతుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో కూడా రవాణా జరిగిపోతుంటుంది. సాధారణంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఆ సమయాల్లో కాకుండా తెల్లవారు జామున, మిట్టమధ్యాహ్నం, పోలీసులు బందోబస్తు విధుల్లో బిజీగా ఉన్నప్పుడు హవాలా ద్వారా డబ్బు తరలిపోతోంది. సబ్బుల కార్టన్లు, దుస్తుల ప్యాకింగ్‌లో నగదును పెట్టి తరలిస్తుంటారు. సాధారణ సంచుల్లో తీసుకెళితే ఎవరికీ అనుమానం రాదని, నడుచుకుంటూ వెళితే ఎవరూ దృష్టి పెట్టరని.. అలా కూడా డబ్బును తీసుకెళుతుంటారు.