న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై యాంటి–మనీ లాండరింగ్ ప్రొవిజన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిప్టో ట్రేడింగ్, సేఫ్ కీపింగ్, సంబంధిత ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు యాంటి–మనీ లాండరింగ్ చట్టాన్ని అప్లయ్ చేస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు అనుమానం కలిగించే ట్రాన్సాక్షన్ల వివరాలను దేశంలోని క్రిప్టో ఎక్స్చేంజీలన్నీ తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గ్లోబల్‌గా అనుసరిస్తున్న ట్రెండ్‌నే మన దేశం కూడా ఫాలో అవుతోంది. బ్యాంకులు, స్టాక్‌బ్రోకర్లకు ఏ విధంగా యాంటి–మనీ లాండరింగ్ రూల్స్ వర్తింప చేస్తున్నారో, ఇప్పుడు క్రిప్టోకు కూడా అదే విధమైన రూల్స్‌ను అమలులోకి తెచ్చారు.
క్రిప్టో కరెన్సీలతో పాటు, నాన్–ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) వంటి డిజిటల్ కరెన్సీ అసెట్లు గత రెండేళ్లలో గ్లోబల్‌గా జోరందుకున్నాయి. ఈ ఎసెట్లలో ట్రేడింగ్ చాలా రెట్లు ఎక్కువైంది. కిందటేడాది దాకా క్రిప్టో ఎసెట్ల నియంత్రణకు మన దేశంలో ఎలాంటి పాలసీ లేదు. క్రిప్టో ఎసెట్ల రెగ్యులేషన్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ తేవాలని జీ–20 మెంబర్లతో చర్చిస్తున్నట్లు ఇంతకు ముందే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వెల్లడించిన విషయం తెలిసిందే. క్రిప్టో ఎసెట్లు, వెబ్3 కొత్తగా ఎదుగుతున్న రంగాలని, వీటి నియంత్రణకు లెజిస్లేషన్ తేవాలంటే గ్లోబల్ కొలాబరేషన్ ఆవశ్యకమని ఫైనాన్స్ మినిస్టర్ పేర్కొన్నారు.
క్రిప్టో ట్రాన్సాక్షన్ల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్నును తాజా బడ్జెట్లో విధించారు. దీంతోపాటు, అలాంటి ఎసెట్లలో ఒక పరిమితికి మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఒక శాతం టీడీఎస్‌ను కూడా అమలులోకి తెచ్చారు. గిఫ్టులుగా వచ్చిన క్రిప్టో, డిజిటల్ ఎసెట్స్ పైనా టాక్స్ వేస్తున్నారు.
