
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక కోతి ల్యాబ్ టెక్నీషియన్‌పై దాడి చేసి.. అతని దగ్గర నుంచి ముగ్గురు కరోనా పేషంట్ల రక్త నమూనాలను ఎత్తుకెళ్లింది. శాంపిల్స్‌తో పాటు గ్లోవ్స్ కూడా తీసుకొని చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. అక్కడ ఆ కోతి గ్లోవ్స్ తినడానికి ప్రయత్నించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగింది. ఈ మెడికల్ కాలేజీని కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ కరోనా శాంపిల్స్ కాదని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్కె గార్గ్ తెలిపారు. ‘కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ సాధారణ పరీక్షల కోసం తీసుకున్నవి. కరోనావైరస్ నమూనాలను ఓపెన్‌గా కాకుండా.. ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి ఆస్పత్రి చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. కరోనావైరస్ మనుషుల నుంచి కోతులకు వ్యాపించగలదని ఇప్పటివరకు రుజువుకాలేదు’ అని ఆయన అన్నారు.
ఏదేమైనా.. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ జంతువులలో మాత్రమే కరోనావైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జంతువులకు మాత్రమే కరోనా సోకిందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.