కేరళను కలవరపెడుతోన్న మంకీపాక్స్ 

కేరళను కలవరపెడుతోన్న మంకీపాక్స్ 

కరోనా కంట్రోల్ అయ్యిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో వ్యాధి ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. మంకీపాక్స్ దేశంలోకి ఎంటర్ కావడంతో జనం భయంతో వణికిపోతున్నారు. గతవారం కేరళలో తొలికేసు నమోదవ్వగా..తాజాగా కన్నూరుకుచెందిన మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ఈనెల 13న దుబాయ్ నుంచి కోస్టల్ కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన  31 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. అతడి శాంపిల్స్ ను పుణేకు పంపించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని అధికారులు తెలిపారు.

మంకీపాక్స్ సోకిన రెండో వ్యక్తితో ఎవరెవరు కలిసి తిరిగారనే విషయమై కూడా అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.దేశంలోని కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం  అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ కు సంబందించి తీసుకోవాల్సిన చర్యలపై పలు మార్గదర్శకాలను కూడా కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. 

ఈనెల 12న దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ఈ నెల 14న ప్రకటించారు.  కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుండి నిపుణుల బృందాన్ని పంపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. 

మంకీపాక్స్ సోకిన వారికి జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. మంకీపాక్స్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వారిలో సుమారు 1 శాతం మరణాలు నమోదౌతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.