
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయి. 2025, మే 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. తాజాగా కేరళకు విస్తరించాయి. శనివారం (మే 24) ఉదయం నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని టచ్ చేశాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది 8 రోజులు ముందే తీరాన్ని టచ్ చేశాయి.
గత 16 సంవత్సరాలలో ఈ సారే కేరళలో రుతుపవనాలు తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జూన్ ఫస్ట్ వీక్ లో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు విస్తరించనున్నాయి. నైరుతి రుతు పవనాల రాకతో కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రల్లో రాబోయే 6 రోజుల పాటు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
సాధారణంగా ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రారంభమై.. జూలై 8 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య భారతదేశం నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి పూర్తిగా మాన్ సూన్ క్లోజ్ అవుతోంది. కానీ ఈ ఏడాది జూన్ 1కంటే ముందుగానే అంటే.. 2025, మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ అంచనాకు మూడు రోజుల ముందే అంటే మే 24వ తేదీన నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.