
కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనాలు తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతారవణ శాఖ. 2023, జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు అనౌన్స్ చేసింది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వారం రోజులు ఆలస్యంగా.. తుఫాన్ తీవ్రతను తట్టుకుని.. రుతు పవనాలు కేరళను తాకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కేరళకు వచ్చిన రుతు పవనాలు.. తమిళనాడు, కర్నాటకను దాటుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి రావటానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు ప్రభావం కనిపించటానికి మరి కొంత సమయం పడుతుంది. ఈలోపు ఎండలు యథావిధిగానే ఉంటాయని వాతావరణ శాఖ అంటోంది. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే.. ఈ ఏడాదే మరింత ఆలస్యంగా రుతు పవనాలు దేశంలోకి వచ్చాయి.
కేరళను తాకిన నైరుతి రుతు పవనాల ప్రభావంతో.. ఆ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. 48 గంటలుగా వాతావరణం చల్లబడింది. ఎండ తీవ్రత తగ్గి.. కూల్ వెదర్ ఉంది. చాలా చోట్ల 24 గంటలుగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశించిన సందర్భంగా అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మరో మూడు రోజుల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం(జూన్ 07) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ(జూన్ 08), రేపు(జూన్ 09) అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షం కురుస్తాయని తెలిపింది. శనివారం (జూన్ 10) కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలోని కొన్నిప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.