
న్యూఢిల్లీ : ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. సగటున 868.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 820 ఎంఎం నమోదైనట్లు తెలిపింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్‌పీఏ)లో 94 నుంచి 100 శాతం మధ్య వర్షపాతం రికార్డయితే ‘సాధారణం’గా పరిగణిస్తారు. ‘‘ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సానుకూల అంశాలతో 2023 రుతుపవనాలు 94.4 శాతం వర్షపాతంతో ముగిశాయి. ఇది సాధారణ వర్షపాతంగా పరిగణనలోకి వస్తుంది” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు.
తూర్పు, ఈశాన్య భారతదేశంలో 1,115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణం(1,367.3 మిమీ)తో పోలిస్తే ఇది 18 శాతం తక్కువని వివరించారు. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్‌లో పెద్దగా వానలు పడలేదు. జులైలో మాత్రం దేశవ్యాప్తంగా పోటెత్తాయి. తర్వాత ఆగస్టులో కరువు పరిస్థితులు కనిపించాయి. 1901 ఆగస్టు తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సారే. తర్వాత సెప్టెంబర్‌లోనూ అంతంతమాత్రంగానే పడ్డాయి.