- దేశవ్యాప్తంగా 40 శాతానికి వర్షపాత లోటు
- గుజరాత్‌లో 98%, మహారాష్ట్రలో 79% లోటు నమోదు
- ఖరీఫ్ వేళ కరవు ఛాయలు..విత్తనాలు నాటే ప్రక్రియకు బ్రేక్
- ఈ నెల 21 తర్వాత రుతుపవనాలు పుంజుకునే అవకాశం: ఐఎండీ
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ఏకంగా 40 శాతానికి చేరుకుంది. ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) తాజా లెక్కల ప్రకారం.. ఈ నెల 4 నుంచి బుధవారం వరకు దేశంలో సాధారణంగా 65.9 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. కానీ, కేవలం 39.7 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.
ఐఎండీ శాటిలైట్ ఫొటోల ప్రకారం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక వంటి ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో ఆకాశం మేఘాలు లేకుండా పూర్తిగా పొడిగా కనిపిస్తోంది. సాధారణంగా ఇదే సమయానికి దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన రుతుపవన మేఘాలు.. కేవలం బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. రుతుపవనాల కదలికలు నిలిచిపోవడంతో దేశంలోని పలు కీలక రాష్ట్రాలు తీవ్ర వర్షపాత కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో అత్యధికంగా 98 శాతం, మహారాష్ట్రలో 79 శాతం వర్షపాత లోటు నమోదైంది.
అలాగే, మేఘాలయలో 85 శాతం, జార్ఖండ్‌లో 66 శాతం, చత్తీస్‌గఢ్‌లో 65 శాతం కొరత ఏర్పడింది. అంతేగాక, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, బిహార్, అస్సాం రాష్ట్రాల్లోనూ వర్షాలు ముఖం చాటేశాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు బలహీనపడటం, వాతావరణంలో అసాధారణ మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆందోళనలో వ్యవసాయ రంగం
జూన్ నెల సగం ముగిసినా ఇప్పటిదాకా వర్షాలు పడకపోవడం దేశీయ వ్యవసాయ రంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. వరి, సోయాబీన్, పత్తి, పప్పుధాన్యాలు వంటి ఖరీఫ్ పంటలను విత్తడానికి జూన్ అత్యంత కీలకమైన సమయం. వర్షాలు లేకపోవడంతో విత్తనాలు నాటే ప్రక్రియ నిలిచిపోయింది. ఇది నేలలోని తేమను తగ్గించి పంటల షెడ్యూల్‌ను దెబ్బతీస్తోంది. అయితే, జూన్ 21 తర్వాత సముద్రం నుంచి తేమ ప్రవాహం పెరిగి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
