
భానుడి ప్రతాపానికి అల్లల్లాడుతున్న ప్రజలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానే రానున్నాయని వెల్లడించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మంగళవారం ( మే 13 ) అండమాన్ తీరాన్ని తాకనున్నాయని.. ఆ తర్వాత మూడు రోజులు అటు ఇటుగా మే 27న కేరళాలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. గత ఏడాది మే 31న నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేయగా.. మే 30న తీరాన్ని తాకాయి.
ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏకంగా 105శాతం వర్షపాతం నమోదుకానున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.
ఆరు అంశాల ఆధారంగా నైరుతి రుతుపవనాల రాకను అంచనా వేసినట్టు ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీ మాన్సూన్ వర్షాలు, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో సగటు సముద్ర పీడనం, దక్షిణ చైనా సముద్రంలో రేడియేషన్ తగ్గుదల, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలులు, ఇండోనేసియా రీజియన్లోని గాలుల ప్రభావం ఆధారంగా నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని అంచనా వేసినట్టు తెలిపింది.
►ALSO READ | కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
గత ఐదేండ్లు అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని తెలిపింది. 2020లో జూన్ 5న ఎంటరవుతాయని అంచనా వేయగా.. అంతకన్నా నాలుగు రోజుల ముందుగానే జూన్ 1న ప్రవేశించాయని వెల్లడించింది. 2023లో జూన్ 4న వస్తాయని అంచనా వేస్తే జూన్ 8న, 2024లో మే 31న కేరళలోకి ఎంటరవుతాయని ఫోర్కాస్ట్ ఇస్తే మే 30న రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.