తలకిందులుగా నీటిలో మూన్ వాక్

తలకిందులుగా నీటిలో మూన్ వాక్

మైకేల్ జాక్సన్ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది మూన్‌‌వాక్. ప్రపంచంలోని మోస్ట్ ఐకానిక్ డాన్స్ స్టెప్స్‌‌లో ఇదొకటి. ఈ స్టెప్ కనిపెట్టి ఇన్నేండ్లయినా దానికుండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒకతను మూన్‌‌వాక్‌‌ను తలకిందులుగా చేశాడు. అదికూడా నీటిలో. ఈ అరుదైన ఫీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా మూన్‌‌వాక్ స్టెప్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్న విషయం. అలాంటిది  దాన్ని తలకిందులుగా వేసి అందరితో ‘వావ్’ అనిపించుకున్నాడు గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌‌కు చెందిన జయ్‌‌దీప్ గోహిల్. ఇంజనీర్ అయిన జయ్‌‌దీప్ ఇండియాలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డాన్సర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా హాజ్​ గాట్ టాలెంట్, ఎంటర్ టైనర్ నెం.1 లాంటి టాలెంట్ షోల్లో తన అరుదైన టాలెంట్‌‌తో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ‘హైడ్రోమాన్’ పేరుతో ఉన్న తన సోషల్ మీడియా అకౌంట్‌‌కు ఏడు లక్షలమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. రీసెంట్‌‌గా పోస్ట్ చేసిన అండర్ వాటర్ రివర్స్ మూన్‌‌వాక్ స్టెప్ వీడియోకు 9 మిలియన్ల వ్యూస్, ఒక మిలియన్​ లైక్స్ వచ్చాయి.