అగ్రి చట్టాలపై స్టే విధించడం బీజేపీ నైతిక ఓటమే

అగ్రి చట్టాలపై స్టే విధించడం బీజేపీ నైతిక ఓటమే

చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై అకాలీదళ్ చీఫ్ సుఖ్‌‌బీర్ సింగ్ బాదల్ స్పందించారు. దీన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నైతిక ఓటమిగా చూడాలని సుఖ్‌‌బీర్ అన్నారు. రైతులు గౌరవంగా చేస్తున్న ఈ పోరాటంలో కిరాయి గూండాలను పంపి అన్నదాతల నిరసనలను కించపరచాలని చూస్తున్నట్లు తమకు నివేదికలు అందాయన్నారు. ఇది సరికాదని, దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

‘సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే వారు ఉన్నారు. ఇది ఓ జోక్, దీన్ని మేం ఆమోదించబోం. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌‌కు బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న రహస్య సంబంధాలను ఇది బయటపెడుతోంది. రైతుల నిరసనల్లో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని కేంద్రం చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. కొత్త చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు రైతులతో కలసి శాంతియుత ఆందోళనల్లో పాల్గొనడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని సుఖ్‌‌బీర్ పేర్కొన్నారు.