
గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడ్తున్నాయి. బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును 15 ఏళ్ల కాలానికి తీసుకున్న ఒరేవా గ్రూప్.. వేరే సంస్థకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జి మరమ్మతులకు 2 కోట్లు కేటాయిస్తే.. కాంట్రాక్ట్ సంస్థ కేవలం 12 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
కేబుల్ బ్రిడ్జి మరమ్మతులకు కాంట్రాక్ట్ తీసుకున్న ఒరెవా సంస్థ గడియారాలు తయారు చేస్తుంది. ఈ సంస్థకు మౌలిక సదుపాయాల కల్పనలో నైపుణ్యం, అనుభవం లేదు. అందుకే ధ్రగాంధ్రకు చెందిన దేవ్ ప్రకాశ్ సొల్యూషన్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ సంస్థకు కూడా కేబుల్ బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ నుంచి కీలక డాక్యుమెంట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.