శ్రీకారం లాంటి సినిమాలు మరిన్ని రావాలి: కేటీఆర్

శ్రీకారం లాంటి సినిమాలు మరిన్ని రావాలి: కేటీఆర్

శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా బి.కిశోర్ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీ రేపు రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ ‘నేను చాలా రకాల ఈవెంట్స్కి వెళ్తుంటాను. కానీ మనసును తాకే సందర్భాలు కొన్నే ఉంటాయి. ఈరోజు నేనలా ఫీలవుతున్నాను. ‘ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు’ అని పెద్దలు చెబుతుంటారు. వ్యవసాయం అనే మాటలోనే వ్యయం ఉంది, సాయం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యయం పెరిగిపోయి రైతు వ్యవసాయం చేసే పరిస్థితి దేశంలోని చాలా ప్రాంతాల్లో లేదు. ఎందుకంటే అవసరమైన సాయం అందడం లేదు. ఇలాంటి సమయంలో రైతుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయడం మంచి విషయం. యువత రైతుగా మారితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందనే మంచి పాయింట్తో తీసిన సినిమా. మనసు పెట్టి తీశారనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి.  మంచి సినిమాని అందరూ ఆదరించాలి, సపోర్ట్ చేయాలి. అందరూ ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని, రైతులకు అండగా నిలబడాలని ఆశిస్తున్నాను’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘యూత్ తలచుకుంటే ఏం చేయగలదో ఈ సినిమాలో చూపించాం. కేటీఆర్గారు తెలంగాణకే కాదు, ఇండియాకే యూత్ ఐకాన్. వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో చూపించాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఎంత డెవెలప్ అయ్యిందో మనకి తెలుసు. అలాగే తండ్రి అడుగుజాడల్లో నడిచే కొడుకు కథ ఇది. కేటీఆర్ గారు కూడా అలాంటి కొడుకే. అంటే ఈ కథే కేటీఆర్ గారిని ఇక్కడికి రప్పించింది. ఇది అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా చేయడం నా బాధ్యతని నేను అనుకున్నాను. అలాగే ఈ సినిమా చూడటం మీ బాధ్యత అని ఫీలవ్వండి’ అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేనొక కథ రాసుకున్నాను. దాన్ని జీవితంగా మార్చారు శర్వానంద్, మా ప్రొడ్యూసర్స్. ఒక కొత్త డైరెక్టర్ ఇంత వరకు రావాలంటే ఎంతోమంది సహకారం కావాలి. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టీమ్ మొత్తానికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ‘ఇది నాకొక స్పెషల్ ఫిల్మ్. ఇంత మంచి కాన్సెప్ట్లో నేనొక పార్ట్ కావడం గర్వంగా ఉంది. ఇది కేవలం వ్యవసాయం గురించి తీసిన సినిమా కాదు. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పింది హీరోయిన్. ‘ఇదొక ఎమోషనల్ మూవీ. ఏ పాత్ర చూసినా మనకి తెలిసిన వ్యక్తిలానే అనిపిస్తుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పని చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, చీఫ్ గెస్ట్ కేటీఆర్ గారికి థ్యాంక్స్’ అని చెప్పారు నిర్మాతలు. హరీష్ శంకర్, అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, రావు రమేష్, వీకే నరేష్, పెంచలదాస్ తదితరులు పాల్గొన్నారు.