
- మామూలు కన్నా ఎక్కువ వానలు పడతాయన్న ఐఎండీ
- దేశమంతటా 101% వర్షపాతం నమోదవుతుందని అంచనా
- రాష్ట్రంలోనూ మంచి వానలే: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు: రైతన్నలు, జనాలకు వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈసారి వానాకాలం మంచిగైతదని వెల్లడించింది. దేశమంతటా మామూలు నుంచి సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడతాయని ప్రకటించింది. మంగళవారం రెండో లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ను ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర విడుదల చేశారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకుతాయని చెప్పారు. 1961–2010 మధ్య నిర్ణయించిన వర్షపాతం ఎక్కువ కాలపు సగటు (లాంగ్ పీరియడ్ యావరేజ్– ఎల్పీఏ) 88 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వానలు పడతాయని, వర్షపాతం 101 శాతం నమోదవుతుందని ఆయన తెలిపారు.
వాయవ్య, మధ్య, దక్షిణ ఇండియాల్లో మామూలు నుంచి మామూలు కన్నా ఎక్కువ వానలు కురుస్తాయని మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. వాయువ్య ఇండియాలో 92 నుంచి 108 శాతం, సెంట్రల్ ఇండియాలో 94 నుంచి 106 శాతం, సౌతిండియాలో 93 నుంచి 107 శాతం మేర వానలు పడతాయని చెప్పారు. అదే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం మామూలు కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని, 95 శాతం కన్నా తక్కువ వానలు పడతాయని వెల్లడించారు. బీహార్, వెస్ట్‌బెంగాల్, అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మామూలు కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.
స్థిరంగా ఎల్‌నినో
ప్రస్తుతం పసిఫిక్ మహా సంద్రంలో ఎల్‌నినో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్అన్నారు. హిందూ మహాసముద్రంలోనూ అక్టోబర్ వరకు వానలకు అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. కాగా, ఈసారి తొలిసారిగా వానాకాలం అంచనాల్లో గుజరాత్ నుంచి ఒడిశా మధ్య ఉన్న మాన్సూన్ కోర్ జోన్‌పై ప్రత్యేక ఫోర్కాస్ట్ను వెల్లడించారు. ఆ ప్రాంతంలో 106 శాతానికిపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది సాధారణ వానలు
ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 నుంచి 104 శాతం వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో సగటున 93 నుంచి 107 శాతం వర్షాలు కురిసే అవకాశముందన్నారు. దేశంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సమతుల వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. కొన్నిచోట్ల సాధారణ, మరికొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.