సౌత్​లో ఇండియా కూటమికి 100కు పైగా సీట్లు : సీఎం రేవంత్

సౌత్​లో ఇండియా కూటమికి 100కు పైగా సీట్లు : సీఎం రేవంత్
  •      ఎన్డీయేకు 20 కంటే తక్కువే వస్తయ్ 

హైదరాబాద్, వెలుగు : ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కేరళలోని కోజికోడ్​లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు పానక్కాడ్ సయ్యద్ సాదికాలి శిహాబ్ తంగల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత సామరస్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. 

‘‘దక్షిణ భారతదేశంలోని 130 సీట్లలో ఇండియా కూటమికి 100కు పైగా వస్తాయి. కేరళలోని 20 సీట్లలో ఎన్డీయేకు ఒక్కటీ రాదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కవు. వాళ్లకు తమిళనాడులోనూ సున్నా సీట్లే. మొత్తంగా దక్షిణాదిలో ఎన్డీయేకు 20 కంటే తక్కువే సీట్లు వస్తాయి. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌‌‌‌ లో గతంలో కంటే సగం సీట్లే వస్తాయి. ఇక ఎన్డీయేకు 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి” అని ప్రశ్నించారు. 

దేశంలో సమైక్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “మతతత్వ శక్తులు గెలిస్తే అది దేశానికి, మన రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ప్రమాదకరం. ప్రజలకు కూడా ప్రమాదకరం. మతోన్మాద శక్తులు 400 సీట్లపై ఎందుకు కన్నేశాయి? రాజ్యాంగాన్ని మార్చడానికా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేయడానికా?” అని ప్రశ్నించారు. 

కేరళ ప్రజలు మతతత్వ శక్తులను అనుమతించరని, అందుకు తనకు ఈర్ష్యగా ఉందన్నారు. మతతత్వ శక్తులతో ఎలా పోరాడాలనేది కేరళ నుంచి నేర్చుకోవాలని, ఇండియా కూటమికి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) రోల్ మోడల్ అని అన్నారు.

నెహ్రూకు సీఎం నివాళులు

మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్ తన నివాసంలో  సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సంపత్  కుమార్, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ ఆత్మ ప్రతిబింబించేలా చిహ్నం

తెలంగాణ ఆత్మ, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాష్ట్ర అధికారిక చిహ్నం తయారవుతోంది. అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను ఆయన పరిశీలించారు. తుది నమూనా ఎలా రావాలన్న అంశంపై సూచనలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి చిహ్నం ఫైనల్​ చేసి రిలీజ్​ చేసేలా ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది.