క్లాసు రూముల్లో టీచర్లుగా మారుతున్న స్టూడెంట్లు  

క్లాసు రూముల్లో టీచర్లుగా మారుతున్న స్టూడెంట్లు  
  • రాష్ట్రంలో 20 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీ 
  • ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు 
  • అయినా ఇప్పటికీ వలంటీర్లను తీసుకోలే 

హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ (ఏడో తరగతి వరకు)​లో 128 మంది స్టూడెంట్స్ ​ఉండగా ఒకే టీచర్ పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సీతారాంపేట మండల పరిషత్ ప్రైమరీ స్కూల్(ఐదో తరగతి వరకు)లో 55 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఈ స్కూల్​లోనూ ఒక్క టీచరే ఉన్నారు..ఇట్ల రాష్ట్రంలోని సర్కార్​ బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఐదు, ఏడో తరగతి వరకు కొనసాగుతున్న స్కూళ్లలోనూ ఒక్కరే టీచర్ పనిచేస్తున్నారు. కొన్ని  హైస్కూళ్లు ఇద్దరు, ముగ్గురు టీచర్లతోనే నడుస్తున్నాయి. ఇంకా టీచర్లను ఏర్పాటు చేయని స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు మొదలవడంతో టీచర్ల కొరత మరింత పెరిగింది. అయినా సర్కారు పెద్దలు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

సర్దుబాటు కూడా చేయట్లే..
గత ఏడాది విద్యావలంటీర్లను తీసుకోకపోవడంతో ఉన్న టీచర్లనే అవసరమున్న స్కూళ్లకు డిప్యూటేషన్ పై  వారంలో మూడు రోజులు పంపించి సిలబస్ చెప్పించారు. ఒక్కో జిల్లాలో వంద నుంచి 300 మంది వరకు టీచర్లను అడ్జెస్ట్ చేశారు. దీనివల్ల రెండు చోట్ల పాఠాలు చెప్పిన టీచర్లు  ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది సర్కారు ఆ పని కూడా చేయడం లేదు. దీంతో ఐదారు క్లాసుల స్టూడెంట్లను ఒక్క టీచరే చూసుకోవాల్సిన పరిస్థితి. చేసేది లేక కొన్ని చోట్ల పెద్ద క్లాసు పిల్లలతో చిన్న తరగతుల పిల్లలకు లెసన్స్​ చెప్పిస్తున్నారు.

ఇంగ్లిష్​ మీడియం సరే.. మరి టీచర్లు?
రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా స్కూళ్లుండగా వాటిలో 20 లక్షలకుపైగా స్టూడెంట్లు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకూ అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభిస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ లెక్కన కొత్తగా15,368 బడుల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు మొదలయ్యాయి. స్టేట్ వైడ్​గా 1,03,911 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కరోనాకు ముందు 2019–20 అకడమిక్ ఇయర్​లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో 16 వేల మంది విద్యావలంటీర్లను తీసుకున్నారు. కోవిడ్ ఎఫెక్టుతో వీవీలను రెండేండ్ల నుంచి రెన్యూవల్ చేయలేదు. ఇప్పటికే 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు ప్రారంభించినా.. టీచర్లను ప్రత్యేకంగా కేటాయించలేదు. ఉన్న టీచర్లకే  ట్రైనింగ్​ఇచ్చి వారితోనే తెలుగు, ఇంగ్లిష్ మీడియం క్లాసులు చెప్పిస్తున్నారు. మరో పక్క సింగిల్ టీచర్ ఉన్న చాలా ప్రైమరీ స్కూళ్లలో దాదాపు తెలుగు మీడియం ఎత్తేసి, ఇంగ్లిష్ మీడియం షురూ చేశారు. దీంతో టీచర్లతోపాటు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

ప్రైవేటు నుంచి సర్కారుకు వస్తున్నా..
కరోనా ఎఫెక్ట్​తో ఆదాయం తగ్గి ఫీజుల భారం మోయలేక చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్​ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేర్పించారు. 2021–22 అకడమిక్ ఇయర్​లో ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారులోకి రెండున్నర లక్షల మంది స్టూడెంట్లు చేరినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కూడా ప్రైవేటు బడుల నుంచి పిల్లలను రప్పించేందుకు ఇంగ్లిష్ మీడియం క్లాసులు మొదలుపెట్టారు. అయితే దీన్ని ప్రచారం చేయడంలో సర్కారు పెద్దలు, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు విఫలమయ్యారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే లక్షన్నర మంది స్టూడెంట్లు కొత్తగా చేరారు. అయితే గతేడాది సర్కారు బడిలో చేరిన స్టూడెంట్లు.. సరిపడా టీచర్లు లేరని మళ్లీ ప్రైవేట్​ బడుల బాటనే పడుతున్నట్టు హెడ్మాస్టర్లు చెబుతున్నారు.

మళ్లీ ప్రైవేటుకే పోతరు..
ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో బడుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నయ్. కానీ సరిపడ టీచర్లను నియ మించకపోతే ఎట్ల?చేరుతున్న పిల్లలను కాపాడుకోకపోతే మళ్లీ ప్రైవేటుకే పోతరు. బడుల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అప్పటివరకు వలంటీర్లనైనా తీసుకోవాలి.
- సదానందంగౌడ్,  ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు