తెలంగాణలో 250 కొత్త గ్రామ పంచాయతీలు : గెజిట్ విడుదల

తెలంగాణలో 250 కొత్త గ్రామ పంచాయతీలు : గెజిట్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో 250 కి పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నేడో రేపో  గెజిట్ విడుదల చేయనుంది. రాష్ర్టంలో ప్రస్తుతం 12,769 జీపీలు ఉండగా కొత్త జీపీలతో ఈ సంఖ్య 13వేలు దాటనుంది.  ఉమ్మడి రాష్ర్టంలో 8,500 ఉండగా 2018 లో 500 జనాభా దాటిన తండాలను, పెద్ద గ్రామ పంచాయతీలను విభజించి 4,500 కు పైగా కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, లోకల్ బాడీ నేతలు , జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదముద్ర వేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త జీపీల ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల జీరో అవర్ లో  చాలామంది ఎమ్మెల్యేలు కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో వీటిపై కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రభుత్వం జీపీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   కేంద్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి లోకల్ బాడీలకు నిధులు వస్తుండటంతో కొత్త జీపీలు మరింత డెవలప్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా  ఏర్పాటు చేస్తున్న జీపీల్లో 250 జనాభా ఉన్న తండాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.