
- ‘సాగర్’లో ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింపు
- 12 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలకు అనుమతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా 3,03,585 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో మూడు అడుగుల లోపు 1,14,566 విగ్రహాలుండగా, అంతకు మించినవి 1,89,019 ఉన్నాయి. హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా 20 చెరువులు, 74 ఆర్టిఫిషియల్పాండ్స్ ల్లో నిమజ్జనం జరిగింది. ఇందులో హుస్సేన్ సాగర్ లోనే 25 వేల వరకు విగ్రహాల నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్ లో ఆదివారం సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగింది.
శనివారం రాత్రి 10 గంటల తర్వాత బయలుదేరిన చాలా విగ్రహాలు ఉదయం వరకు హుస్సేన్సాగర్వద్దకు చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు కూడా ట్యాంక్ బండ్, పీవీ మార్గ్లపై నిమజ్జనం కోసం విగ్రహాలు క్యూ కట్టి కనిపించాయి. 12 గంటల తరువాత ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాలు తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ట్యాంక్ బండ్ వైపు వాహనాలు వెళ్లేందుకు పర్మిషన్ఇచ్చారు. రాత్రి నుంచి క్రేన్లను తొలగించడం మొదలుపెట్టారు. కాగా, అందరి సహకారంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతమైందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
జోన్ల వారీగా నిమజ్జనం వివరాలు...
- ఎల్బీ నగర్ 40,379
- చార్మినార్ 24,150
- ఖైరతాబాద్ 79,217
- శేరిలింగంపల్లి 44,555
- కూకట్‌పల్లి 69,798
- సికింద్రాబాద్ 45,486