కన్నీటి వరద..కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

కన్నీటి వరద..కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
ఇంకా నీళ్లలోనే వందలాది గ్రామాలు
ఓరుగల్లు, ఖమ్మంలో కాలనీలన్నీ బురదమయం
భారీ వర్షాలు, వరదలకు 30 మందికి పైగా మృతి
16 లక్షల ఎకరాల్లో నీటమునిగిన పంటలు
కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో మునిగిన మంచిర్యాల
అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై జనం ఆగ్రహం

నెట్‌‌వర్క్/హైదరాబాద్, వెలుగు:
ఎడతెరిపి లేని వర్షాలు, వరదలు అంతులేని విషాదం నింపాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 30కి పైగా నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వరదల వల్ల వేలాది కుటుంబాలు గూడు కోల్పోయి.. కట్టుబట్టలతో మిగిలాయి. రోడ్లు తెగి, బ్రిడ్జిలు కూలి వేలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఇండ్లు పూర్తిగా, 2 వేలకు పైగా ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరంగల్, ఖమ్మం, మంచిర్యాల లాంటి సిటీలు, పట్టణాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గోదావరి ముంపు బాధితులతో కలిపి సుమారు 10 వేల మందికి పైగా వరద బాధితులు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనే 15 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వరద బాధితులకు సాయం ప్రకటించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేండ్లుగా  కాలనీలు మునుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావును వరద బాధితులు నిలదీశారు. తర్వాత ఆయన ఇంటిని ముట్టడించారు.
కన్నీటి వరద వర్షాలు, వరదలకు గ్రేటర్ వరంగల్‍ సిటీలోని సుమారు 170 కాలనీలు జలమయమయ్యాయి. శుక్రవారం వరద తగ్గుముఖం పట్టడంతో కొన్ని కాలనీల్లో ఇప్పుడిప్పుడే జనం ఇండ్లకు తిరిగివస్తున్నారు. రోడ్లు, ఇండ్లలో నిండిన బురద, కొట్టుకపోయిన సామన్లను చూసి కంటతడిపెడ్తున్నారు. ఉప్పులు, పప్పులు, బట్టలు, మంచాలు.. ప్రతిదీ బురదమయమైపోయాయి. చాలా కాలనీల్లో మూడు రోజుల క్రితం కరెంట్‍ సప్లై నిలిచిపోవడంతో చీకట్లో అలమటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో, సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆఫీసర్లెవరూ ముంపు గ్రామాలవైపుగానీ, కాలనీలవైపు గానీ కన్నెత్తి చూడడం లేదు. ట్రాన్స్​కో, బల్దియా ఆఫీసర్లు కనీసం ఫోన్లు కూడా ఎత్తకపోవడంపై జనం ఫైర్ అవుతున్నారు. ఏటా వరదలకు కాలనీలు మునుగుతున్నా సర్కారు శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని వరంగల్, ఖమ్మంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోరంచపల్లి ఆగమాగం
బుధవారం రాత్రి వాగు ఉప్పొంగడంతో నీటమునిగిన మోరంచపల్లిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామస్థులంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇండ్లలోని పరిస్థితులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఇంట్లో మూడు, నాలుగు ఫీట్ల ఎత్తుతో బురద పేరుకుపోయింది. బియ్యం సహా సరుకులు, నిల్వ చేసిన పత్తి తడిసిపోయాయి. పాతగోడలు కూలిపోగా, స్లాబ్‌‌‌‌ ఇళ్లు సైతం దెబ్బతిన్నాయి. రాత్రి కొట్టుకపోయిన నలుగురి జాడ ఇంకా దొరకలేదు. 150కి పైగా పశువులు చనిపోయాయి. 10 ట్రాక్టర్లు, నాలుగు కార్లు, 15 ట్రాలీ ఆటోలు, యాభైకి పైగా టూవీలర్లు కొట్టుకుపోయాయి. గ్రామాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ సందర్శించి, ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్‌‌‌‌ జిల్లా పరిషత్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గండ్ర జ్యోతి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి రూ.10 లక్షల సాయం అందించారు.

కొట్టుకపోయిన రోడ్లు
వర్షాలు, వరదల కారణంగా రాష్ర్టవ్యాప్తంగా 22 జిల్లాల్లో 51 చోట్ల రోడ్లు తెగిపోయాయి. మరో 384 రోడ్లు డ్యామేజీ అయ్యాయి. వీటి రిపేర్లకు సుమారు రూ.800 కోట్ల ఖర్చు అవుతుందని ఆర్​అండ్​బీ ఆఫీసర్లు అంచనా వేశారు. మరోవైపు పంచాయతీరాజ్ రోడ్లకు భారీ నష్టం వాటిల్లింది. 518 రోడ్లు దెబ్బతినగా, వీటి రిపేర్లకు రూ.577.88 కోట్లు అవుతుందని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు.

16 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్‌‌, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌‌, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పునాస భూముల్లో లేటుగా వేసిన విత్తనాలు భూమిలోనే కుళ్లిపోగా, మొక్కదశలో ఉన్న మక్క, పత్తి, కంది మొలకలు నీటిలో తేలియాడుతున్నాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వివిధ ప్రాంతాల్లో 6,162 కరెంట్ పోల్స్​కూలిపోయాయి. 446 ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కొన్నిప్రాంతాల్లో కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ముంపు గ్రామాల్లో విద్యుత్‌‌ సరఫరా నిలిచిపోయింది.