శిథిలావస్థలో 4 వేలకు పైగా సర్కారు స్కూళ్లు

శిథిలావస్థలో 4 వేలకు పైగా సర్కారు స్కూళ్లు
  • బడులు ఖరాబ్​.. చెట్ల కింద చదువులు
  • మంచినీళ్లు లేక.. టాయిలెట్లు లేక పిల్లల తిప్పలు
  • సమస్యలపై మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కు లేదు
  • డెవలప్​చేస్తామని చెప్పి కమిటీలతో సరిపెట్టిన సర్కారు 

నెట్​వర్క్, వెలుగు: పైనుంచి ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడ్తదో తెలియదు.. పక్క నుంచి ఎప్పుడు ఏ మట్టి పెల్ల రాలిపడ్తదో తెలియదు.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సర్కారు స్కూళ్ల దుస్థితి ఇది. రాష్ట్రంలో 4 వేలకుపైగా సర్కారు బడులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గదుల్లో ఉండే పరిస్థితి లేక.. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెట్లకిందనే పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. ప్రతి జిల్లాలో దాదాపు వందకుపైగా స్కూళ్లు ఏ క్షణాన కూల్తయో తెలియని స్థితిలో ఉన్నాయి. పైకప్పులు పగిలిపోవడం.. గోడలకు, స్లాబులకు నడుమ సందులు రావడం.. పెచ్చులు ఊడిపడ్తుండడంతో టీచర్లు, స్టూడెంట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సర్కారు బడులను ఢిల్లీలోలెక్క డెవలప్​చేస్తం.. కేరళ, ఏపీ స్కూళ్లలెక్క మారుస్తం..’’ అంటూ ఫిబ్రవరిలోనే చెప్పిన రాష్ట్ర సర్కారు.. తొమ్మిది నెలలుగా కమిటీలు, స్టడీల పేరుతో కాలం గడుపుతున్నది. రూ. 2వేల కోట్ల ప్లాన్​, రూ. 7 వేల కోట్ల ప్లాన్​ అంటూ ఫండ్స్​కోసం ఈజీఎస్​ దిక్కు, సీడీఎఫ్​ వైపు చూస్తున్నది. 

నిండా సమస్యలే.. 
రాష్ట్రవ్యాప్తంగా 26,285 సర్కారు బడుల్లో 20.46 లక్షల మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. ఈసారి కరోనా ఎఫెక్ట్​తో జులై ఫస్ట్ నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగా, సెప్టెంబర్1 నుంచి ఫిజికల్ క్లాసులు రన్​ అవుతున్నాయి. కరోనా కారణంగా ఈ దఫా చాలా మంది పేరెంట్స్​ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ఇలా చేరిన స్టూడెంట్స్​ ఒక్కో జిల్లాలో 3 వేల నుంచి 6 వేల వరకు ఉన్నారు. చాలా ఏండ్ల తర్వాత పబ్లిక్​ నుంచి ఇలాంటి పాజిటివ్​ రెస్పాన్స్​ వచ్చిన టైంలోనూ ప్రభుత్వ స్కూళ్లలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ చేయడంపై ప్రభుత్వం ఫోకస్​ పెట్టలేదు. అడపాదడపా సర్వశిక్ష అభియాన్​, డీఎంఎఫ్, మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో అడిషనల్​ క్లాస్​ రూమ్స్​, టాయి​లెట్స్​ కడుతున్నా ఏమూలకూ చాలట్లేదు. తాజా పరిస్థితిని బట్టి సర్కారు బడుల్లో నాలుగోవంతు అంటే 6 వేలకు పైగా స్కూళ్ల​ భవనాలు దెబ్బతిన్నాయి. ఇందులో సుమారు 4 వేల బిల్డింగులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. రిపేర్లు చేయించాల్సిన క్లాస్​రూములకైతే లెక్కలేదు.  స్కూళ్ల ప్రారంభానికి ముందు సర్కారుకు డీఈఓలు పంపిన రిపోర్ట్​ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా  సుమారు 2 వేల స్కూళ్లల్లో తాగడానికి నీళ్లు లేవు.  3 వేల స్కూళ్లల్లో అమ్మాయిలకు టాయిలెట్స్​ లేనట్లు వెల్లడైంది. మిషన్​భగీరథ ఉన్నా.. దీనికింద ఇప్పటికీ వేలాది స్కూళ్లకు కనెక్షన్​ ఇవ్వలేదు. 

ప్లాన్​ రెడీ.. ఫండ్స్​ ఎట్ల?
రాష్ట్రంలోని స్కూళ్లను ఢిల్లీ, కేరళ, ఏపీ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్తున్న రాష్ట్ర సర్కారు ఈసారి బడ్జెట్​లో ఇందుకు రూ. 2 వేల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బడులన్నీ కొత్తగా తీర్చిదిద్దే పనులు ప్రారంభిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు తగిన సలహాలు, సూచనల కోసం విద్యా శాఖ మంత్రి సబిత, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​తో కేబినెట్  సబ్​ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ప్రకటన చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. పలుమార్లు సమావేశమైన సబ్​కమిటీ ఫండ్స్​ గురించి తర్జనభర్జనలు పడడం తప్ప చేసిందేమీ లేదు. తాజాగా మూడు దశల్లో 27 వేల స్కూళ్ల అభివృద్ధి కోసం రూ. 7 వేల కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసి చేతులు దులుపుకుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్ర సర్కారు.. ఇప్పుడీ స్కూళ్ల అభివృద్ధికి ఫండ్స్​ ఎక్కడి నుంచి తేవాలన్న ఆలోచనలో పడింది. ప్రాథమికంగా 25 శాతం ఎమ్మెల్యేల సీడీఎఫ్​నుంచి, మరో 25 శాతం ఈజీఎస్​ నుంచి , మిగిలిన 50 శాతం నిధుల్లో కొంత మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ నిధుల నుంచి మళ్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు కేటాయించే సీడీఎఫ్​నిధుల్లోంచి కనీసం 25 శాతం ఫండ్స్​ను స్కూళ్లకు కేటాయించాలని సర్కారు గతంలోనే ఆదేశించిప్పటికీ.. ఏడాదికాలంగా ఎమ్మెల్యేలు పైసా ఇవ్వలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇకముందు కూడా ఇవ్వడం అనుమానంగానే కనిపిస్తున్నది. 

ఏ జిల్లాలో చూసినా.. 

  •  భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి1,116 స్కూళ్లు ఉండగా, వీటిలో 20 శాతం శిథిలావస్థకు చేరాయి. గతంలో జడ్పీ, మండల పరిషత్ నిధులతో స్కూల్స్​ రిపేర్ చేయించేవారు. ఇప్పుడు ఆ ఫండ్స్​ రావట్లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో684 స్కూల్స్ ఉండగా.. 2,031 అదనపు గదులు, 500 స్కూళ్లలో రిపేర్ల కోసం ఇటీవలే కలెక్టర్​కు డీఈఓ నివేదిక పంపారు. నిజామాబాద్ జిల్లాలో 1,234  సర్కార్ బడులు ఉండగా, 10 శాతం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో దాదాపు 30 % స్కూల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.  
  •  సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్  ప్రైమరీ స్కూల్​లో147 మంది స్డూడెంట్స్​చదువుతున్నారు. ఆరు క్లాస్​రూముల్లో నాలుగు శిథిలావస్థకు చేరుకున్నాయి. పై కప్పులకు రంధ్రాలు, గోడలకు బీటలు పడ్డాయి. కొన్ని క్లాస్​రూమ్స్​లో స్లాబ్​పెచ్చులు ఊడిపోగ మరికొన్నింటికి తలుపులు లేవు. మూడు క్లాసులను క్లబ్ చేసి చదువులు చెప్తున్నారు. 
  •  మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం నర్సింహాపురం బంజారా జీపీలోని లాలితండాలో 22 మంది స్టూడెంట్స్​ఉండగా.. డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్ తో స్కూల్​ నడుస్తున్నది. స్కూల్​బిల్డింగ్​పూర్తిగా శిథిలావస్థకు చేరింది.  2012 నుంచి చెట్లకిందనే పాఠాలు చెప్తున్నారు. 
  •  నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల జడ్పీహెచ్ఎస్​స్కూల్​లో 7వ తరగతి పైకప్పు వారం కింద  కూలింది. దీంతో 10 రోజుల నుంచి చెట్ల కిందే క్లాసులు చెప్తున్నారు. ఐదు క్లాస్​రూంలు ఉండగా రెండు రూములను సగం కట్టి వదిలేశారు. 
  •  నాగర్ కర్నూల్​లోని జడ్పీ హైస్కూల్​లో 1,026 మంది స్టూడెంట్స్​ఉన్నారు. 8 అడిషనల్​రూమ్స్​కావాల్సి ఉండగా డొనేషన్స్​కలెక్ట్​ చేసి రేకుల షెడ్డు వేసుకున్నారు. ఇందులో 150 మంది చదువుకుంటున్నారు. 11 టీచర్​పోస్టులను నింపాల్సి ఉంది. 
  •  సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శంచర్లలోని హైస్కూల్​లో 168 మంది స్టూడెంట్స్ ఉండగా, కేవలం ఐదు క్లాస్ రూములే ఉన్నాయి. రూమ్​లు సరిపోక పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కొత్త బిల్డింగ్  కోసం  ప్రపోజల్స్ పంపి రెండేండ్లవుతున్నా స్పందన లేదు. తుంగతుర్తిలోని జడ్పీ స్కూల్​ను ఓల్డ్​బిల్డింగ్ లోనే నడిపిస్తున్నారు. నైన్త్​క్లాస్​రూమ్​లో వర్షం వచ్చినప్పుడు పై పెచ్చులు ఊడిపడి స్టూడెంట్స్  గాయపడుతున్నారు. అయినా రిపేర్లకు ఫండ్స్ కేటాయించడం లేదు. 
  •  హుజూర్ నగర్ మండలం బురుగడ్డ ప్రభుత్వ హై స్కూల్ లో  కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభించినా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాత బిల్డింగ్ లోనే క్లాసులు కొనసాగిస్తున్నారు. 
  •  వనపర్తి జిల్లా కొత్తకోటలో గర్ల్స్​హైస్కూల్​లో ఉన్న ఐదు క్లాస్​రూమ్స్​సరిపోకపోవడంతో రోజూ ఒక క్లాస్​స్టూడెంట్స్​ను చెట్ల కింద కూర్చోబెట్టి చదువులు చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్​ పిల్లలను చదువులు మాన్పించారు. గతంలో 480 మంది స్టూడెంట్స్​ఉండగా.. ఇప్పుడు 350కి పడిపోయింది. ఏడేండ్లుగా క్లాస్​రూమ్స్​కట్టించాలని ప్రజాప్రతినిధులను కోరగా మున్సిపల్ ఎన్నికల టైంలో శిలాఫలకాలు వేసి పత్తాలేకుండా పోయారు.  

కేంద్రం నిధులిచ్చేందుకు ఓకే చెప్పినా రాష్ట్రం ఇవ్వట్లేదు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన స్కూళ్లకు రిపేర్లు చేయించాలని, కూలిపోయే స్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్తవి కట్టించేలా చొరవ తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఇటీవల గవర్నర్​ తమిళి సైకి లెటర్​ రాశారు. ఈ దిశగా సర్కారు చర్యలు తీసుకునేలా సీఎస్​ను ఆదేశించాలని కోరారు. 4 వేల స్కూళ్లు శిథిలావస్థకు చేరాయని కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిపోర్ట్ పంపితే, ఎస్​ఎస్​ఏ కింద  60 శాతం ఫండ్స్  ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వట్లేదని తెలిపారు.  

131 ఏండ్ల ఓల్డ్​ బిల్డింగ్​లో..!
కరీంనగర్ జిల్లా చొప్పదండి టౌన్​లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్​ను 1890 లో కట్టగా శిథిలావస్థకు చేరింది. ఈ 131 ఏండ్ల కిందటి బిల్డింగ్​లో 127 మంది స్టూడెంట్స్​ చదువుకుంటున్నారు.  పైకప్పు పెంకులు కింద పడుతున్నాయి. పక్కనే కట్టిన రేకులషెడ్డు రూమ్ కూడా పడిపోయే స్థితిలో ఉంది. వానాకాలం పాత బిల్డింగ్​లోని ప్రతి రూమూ ఉరుస్తుంది. పైకప్పు మట్టి కూలుతుంది. దీంతో అందరినీ వరండాలో కూర్చోబెట్టి నెట్టుకొస్తున్నారు. సర్కారు మాత్రం కొత్త బిల్డింగ్​కు పర్మిషన్​ఇవ్వడం లేదు.

ఏపీలోని 17వేల స్కూళ్లలో సకల సౌకర్యాలు
మన రాష్ట్ర ప్రభుత్వం.. కమిటీలు, స్టడీలు​అంటూ కాలయాపన చేస్తుంటే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ఇప్పటికే 17 వేల స్కూళ్లను డెవలప్ ​చేశారు. అవసరమైన అన్నిచోట్ల కొత్త బిల్డింగులు, పాతవాటికి రిపేర్లు,  అడిషనల్​గదులు, వాటికి పేయింటింగ్స్​, కాంపౌండ్ వాల్స్​,  ఫర్నిచర్, తాగేందుకు ఫ్యూరిఫైడ్ వాటర్, టాయ్ లెట్లకు రన్నింగ్ వాటర్, ప్రతి రూములో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు.. ఇలా అక్కడి ప్రభుత్వం బడులలో సకల సౌకర్యాలు కల్పించింది. ఈ క్రమంలోనే  స్టడీ టూర్​ కోసం అప్పట్లో తెలంగాణ ఎస్ఎస్ఏ అడిషనల్ డైరెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో మూడు టీంలు ఏపీలోని కృష్ణా జిల్లాలోని పలు స్కూళ్లకు  వెళ్లి పరిశీలించి, అబ్బురపోయాయట. మనోళ్లు మాటలకే పరిమితమైతే ఏపీ ప్రభుత్వం చేతల్లో చూపిందని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లో అప్పట్లో చర్చ కూడా నడిచింది. 

బిల్లులివ్వని సర్కారు.. వదిలేసి పోయిన కాంట్రాక్టర్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగుబండ జడ్పీ హైస్కూల్​లో దాదాపు 150 మంది స్టూడెంట్స్​కు ఒకటే క్లాస్​రూమ్​ ఉంది. ఆఫీసు రూమ్​కూడా ఒక్కటే. గతంలో ఓ రూమ్​కట్టడానికి ఫండ్స్​వచ్చినా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. చెట్ల కిందే టీచర్లు పాఠాలు చెప్తున్నారు. గతంలో 350 మంది స్టూడెంట్స్​ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 200కు పడిపోయింది.  

ప్రతి రోజూ ఒక క్లాస్​బయటే..
40 ఏండ్ల క్రితం కట్టిన స్కూల్​మాది. మా ప్రైమరీ స్కూల్​లో నాలుగు క్లాస్​రూమ్స్ ​ఉండగా అన్ని గదుల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఇప్పటివరకు వీటిని రిపేర్ ​చేసింది లేదు. ఎప్పుడు గోడ పడిపోతుందోనని భయపడుతూ పాఠాలు చెప్పాల్సి వస్తున్నది. ప్రతిరోజూ ఒక క్లాస్​కు బయట పాఠాలు చెప్తున్నం. 
- సీత, హెచ్ఎం, చండ్రుగొండ ప్రైమరీ స్కూల్​, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా

ప్రభుత్వానికి డీఈఓలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం..
మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లు 2000
అమ్మాయిలకు టాయిలెట్స్​ లేని స్కూళ్లు 3000