
- ఒకటి, రెండు రోజుల్లో కన్సల్టెన్సీ కోసం నోటిఫికేషన్
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాల ప్రాజెక్టును పరిశీలించిన వెళ్లిన రెండో రోజే ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సంబంధిత అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. బ్రిడ్జి ఎక్కడ నిర్మించాలి? ఎక్కడ బ్రిడ్జి కడితే అంచనాలు తగ్గుతాయి? ఎక్కడ కడితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది? అనే దానిపై ఆర్అండ్ బీ శాఖ కన్సల్టెన్సీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కన్సల్టెన్సీ నివేదిక అనంతరం ఎక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, అంచనా వ్యయంపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టు పరిశీలించారు. ప్రాజెక్టుపై నుంచి హెవీ వెహికల్స్ రాకపోకలు సాగిస్తుండడంతో ఇబ్బందిగా ఉందని భావించి ప్రాజెక్ట్ దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి.
2022లోనే రూ.121.92 కోట్ల అంచనా..
జూరాల దిగువన బ్రిడ్జి నిర్మాణానికి 2022లో ఇరిగేషన్ అధికారులు రూ.121.92 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. జూరాల దిగువన కిలోమీటర్ దూరంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. ధరూర్ మండలం రేవలపల్లి గ్రామం నుంచి అమరచింత మండలం నందిమల్ల వరకు రైట్, లెఫ్ట్ కెనాల్ తో పాటు సమాంతర కాలువపై బ్రిడ్జి నిర్మించాలని అప్పట్లో అంచనాలు రూపొందించారు. 12.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా బ్రిడ్జి నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ తరువాత అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ఇదిలాఉంటే గతంలో బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించిన స్థలం మారే అవకాశం ఉండడంతో అంచనాల్లో తేడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
స్థల ఎంపికపై సందిగ్ధం..
బ్రిడ్జి నిర్మించే స్థల ఎంపికపై సందిగ్ధత నెలకొంది. జూరాల ప్రాజెక్టుకు కిలోమీటర్ దూరంలో భీంపురం, నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మించాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఆ స్థలంపై కొందరు అభ్యంతరం చెబుతున్నారు. ధరూర్ మండలం భీంపురం, అమరచింత మండలం నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే ధరూర్ మండలంలోని చింతరేవుల ఆంజనేయస్వామి గుడితో పాటు ఆత్మకూరుకు వెళ్లేందుకు నడిగడ్డవాసులకు అనువుగా ఉంటుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇక్కడ బ్రిడ్జి కడితే తక్కువ ఎత్తు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్అండ్ బీ శాఖ స్థల ఎంపిక కోసం ఏర్పాటు చేసే కన్సల్టెన్సీ ముందు ఈ ప్రపోజల్కూడా ఉంచే ప్రయత్నం చేస్తోంది.
చిగురిస్తున్న ఆశలు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన తర్వాత బ్రిడ్జి నిర్మాణంపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి బ్రిడ్జి కట్టాలని డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో, ఎస్టిమేషన్లు వేసి చేతులు ఊరుకున్నారు. ఈక్రమంలో మంత్రి పర్యటించి వెళ్లిన రెండు రోజులకే జీవో జారీ చేశారు. ఆ తరువాత ఆర్అండ్ బీ సీఈ, ఎస్ఈ, ఈఈలు బ్రిడ్జి నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
జూరాల దిగువన నిర్మించే బ్రిడ్జి విషయంలో స్థల ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇరిగేషన్ శాఖ వేసిన ఎస్టిమేషన్ల ఆధారంగా ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. బ్రిడ్జి నిర్మాణంపై త్వరలో క్లారిటీ వస్తుంది.
కిరణ్ కుమార్, డీఈ, ఆర్అండ్ బీ