
- అటవీశాఖ, సింగరేణి మధ్య భూ బదలాయింపు ఒప్పందం
- కొత్తగూడెం ఏరియాలో కొత్త గని పర్మిషన్ కోసం అప్పగింత
- దేశంలోనే తొలిసారిగా ఇలాంటి విధానానికి శ్రీకారం
గోదావరిఖని, వెలుగు: ఓపెన్ కాస్ట్ గనిపై సింగరేణి అడవిని సృష్టించడమే కాకుండా.. వేరే చోట అటవీ శాఖ వద్ద తీసుకుని ఆ భూమిని బదలాయించింది. ఇలా అటవీ భూమిని తీసుకుని, అందుకు మరోచోట తిరిగి భూమిని ఇచ్చే పద్ధతిని సింగరేణితో పాటు దేశంలోనే తొలిసారి కావడం విశేషం. రామగుండం రీజియన్పరిధి మేడిపల్లి ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్ను రెండేండ్ల కింద మూసివేశారు. ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచకుండా అందులో ఫారెస్ట్డిపార్ట్మెంట్తో కలిసి సింగరేణి మొక్కలు నాటి అడవిలా మార్చింది. కాగా.. కొత్తగూడెం పరిధిలో జీకే ఓపెన్కాస్ట్కొత్త ప్రాజెక్ట్‌కోసం అక్కడ 1,625 ఎకరాలను సింగరేణి తీసుకుంది. దీనికి బదులుగా మేడిపల్లి పాతగనిపై అడవిలా మార్చిన భూమిని ‘కాంపన్సెటరీ అఫారస్టేషన్’ (సీఏ) కింద అటవీశాఖకు అప్పగించనుంది.
2022లో గని మూసివేత
ఆర్జీ –1 ఏరియాలో మేడిపల్లి పరిసరాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో 1994లో ఓపెన్‌కాస్ట్ మైన్ ఏర్పాటు చేశారు. మొత్తం 2,863 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో 1996 నుంచి బొగ్గు తవ్వకాలు చేపట్టారు. మొత్తం 68 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 2022 వరకు 61 మిలియన్‌టన్నుల బొగ్గు వెలికితీశారు. అనంతరం మూసివేశారు. ఇందుకు 335 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తోడి ప్రాజెక్ట్ ఉపరితలంపై డంప్ చేశారు.
మొక్కలతో పాటు వన్యప్రాణులు
మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో బొగ్గు వెలికితీత పనులు ముగిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను ఖాళీగా ఉంచకుండా ‘ ఎన్విరాన్మెంట్మేనేజ్మెంట్ప్లాన్’లో భాగంగా పర్యావరణాన్ని కాపాడేందుకు 2,163 ఎకరాల్లో సింగరేణి మొక్కల పెంపకం చేపట్టింది. ఇందులో అడవి జాతులైన రావి, మర్రి, వేప, చింత, సీమ చింత, నీలగిరి, నార వేప, అల్లనేరుడు, నల్ల తుమ్మ, బట్టగణం, బండారు, సీతాఫలం, వెదురు, వెలగ, ఎగిస వంటి మొక్కలను నాటారు. ఇప్పుడవి పెద్ద వృక్షాలుగా ఎదిగి అడవిలా తయారైంది. దీంతో ఆ ప్రాంతంలో అడవి పందులు, జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పాములు, ముంగిసలు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి.
1,625 ఎకరాలు బదలాయింపు
కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్ను సింగరేణి మొదలుపెట్టినప్పుడు, అక్కడ రాష్ట్ర అటవీ శాఖ నుంచి1,625 ఎకరాల భూమిని తీసుకుంది. దానికి బదులుగా మూసేసిన మేడిపల్లి ఓపెన్కాస్ట్ప్రాంతాన్ని బదలాయించింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో చెట్లతో ఏపుగా పెరిగిపోయి అడవిని తలపిస్తుంది. 2,163 ఎకరాల్లోని భూమిలో1,625 ఎకరాలు రాష్ట్ర అటవీశాఖకు సింగరేణి ఇచ్చింది. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్వేశారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్మొత్తం పూర్తయింది. కాగా నెల రోజుల్లోగా ఆ భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుంది.
పర్యావరణ పరిరక్షణ కోసమే..
ఓపెన్కాస్ట్ఏర్పాటుకు అటవీ భూమిని తీసుకుని, దానికి బదులుగా సంస్థ తన భూమిలో అడవి తయారు చేసి ఇవ్వడం దేశంలోనే తొలిసారి. మేడిపల్లి ఓపెన్కాస్ట్మూసేసిన తర్వాత ఆ ప్రాంతంలోని స్థలంలో మొక్కలు సంరక్షించి వనాలుగా పెంచాం. ఇప్పుడవి పెద్ద చెట్లుగా పెరిగి అడవిలా తయారైంది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందనడానికి మేడిపల్లి ఓసీపీలోని అడవినే నిదర్శనం. - డి.లలిత్‌కుమార్, సింగరేణి జీఎం, గోదావరిఖని