పురిట్లోనే కడ తేరుస్తున్నారు..! భువనగిరి గాయత్రి హాస్పిటల్లో.. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు

పురిట్లోనే కడ తేరుస్తున్నారు..! భువనగిరి గాయత్రి హాస్పిటల్లో.. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
  • మగబిడ్డ కోసం ఆరాటం 
  • రెండో కాన్పు ముందు టెస్ట్ లు చేయించుకుంటున్న గర్భిణులు 
  • ఫీజు కోసం రూల్స్ ఉల్లంఘిస్తున్న డాక్టర్లు 

యాదాద్రి, వెలుగు: కొందరు డాక్టర్లతోపాటు డాక్లర్లుగా చలామణి అవుతున్న మరికొందరు గర్భంలో ఉన్నది.. ఆడ, మగ అని తెలుసుకునేందుకు యథేచ్ఛగా లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. ఆపై అబార్షన్లు కూడా చేస్తున్నారు. సాధ్యం కాని పక్షంలో పురిట్లోనే కడతేరుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణికి తెలియకుండానే ఆబార్షన్లు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. అర్హత లేకున్నా ట్రీట్​మెంట్ చేస్తున్న హాస్పిటల్స్​ను సీజ్ చేస్తే రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని వాటిని  తెరిపిస్తున్నారు. తాజాగా భువనగిరిలోని ఓ హాస్పిటల్స్​లో ఇద్దరు గర్భిణులకు ఆబార్షన్ చేసిన విషయం తెలియగానే పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేసి డాక్టర్​ను అరెస్ట్ చేశారు. 

రెండో కాన్పుకు లింగ నిర్ధారణ..

జిల్లాలో అనుమతి పొందిన 150 హాస్పిటల్స్, 41 డయాగ్నోస్టిక్​సెంటర్లు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేనివి ఎన్నో ఉన్నాయి. కాసుల కోసం యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ  ఆడ శిశువుగా నిర్ధారణ కాగానే అబార్షన్లు చేస్తున్నారు. ఒక్కో అబార్షన్​కు టెస్టులు కలుపుకొని రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అబార్షన్ చేయలేని పరిస్థితులు నెలకొంటే పుట్టిన తర్వాత వదిలించుకుంటున్నారు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టినవారిలో ఎక్కువ మంది రెండోసారి గర్భం దాల్చగానే లింగ నిర్ధారణకు సిద్ధపడుతున్నారు. కొందరైతే మొదటి కాన్పుకు సైతం లింగ నిర్ధారణ టెస్టులకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. 

అబార్షన్ చేయాలంటే..

లింగ నిర్ధారణకు ఎలాంటి అనుమతులు హెల్త్ డిపార్ట్​మెంట్ ఇవ్వడం లేదు. అయితే అబార్షన్ చేయడానికి మాత్రం మెడికల్​టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) పేరుతో అనుమతులు ఇస్తోంది. పిండం ఎదగకున్నా.. తల్లి ప్రాణానికి ప్రమాదమని తేలినా అబార్షన్ చేయవచ్చు. గర్భం ధరించిన 12 వారాల్లోపు టాబ్లెట్స్ తో, 24 వారాల్లోపు అయితే ఆపరేషన్ ద్వారా పిండం తొలగించవచ్చు. అబార్షన్ చేయడానికి జిల్లాలో 16 హాస్పిటల్స్​కు అనుమతి ఉందని హెల్త్ డిపార్ట్​మెంట్​చెబుతోంది. 

ఐదేండ్లలో 50,888 మంది..

హెల్త్ డిపార్ట్​మెంట్ లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 2020 నుంచి ఈ ఏడాది మే వరకు 50,888 మంది జన్మించారు. వీరిలో బాలురు 27, 024 మంది కాగా, బాలికల సంఖ్య 23,864గా నమోదైంది. ఈ లెక్కన జిల్లాలో 3,160 మంది బాలికల సంఖ్య తక్కువగా ఉంది.

కలెక్టర్ ఆదేశాలతో..

ఇటీవల హెల్త్ డిపార్ట్​మెంట్, పోలీస్ డిపార్ట్​మెంట్​లో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు నిర్వహించిన రివ్యూలో జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాల్లోనూ లింగ నిర్ధారణ టెస్టులు జరుగుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో లింగ నిర్ధారణ జరుపుతున్న స్కానింగ్ సెంటర్లు, అబార్షన్ చేస్తున్న హాస్పిటల్స్​పై మెరుపు దాడులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. 

ఇద్దరికి అబార్షన్.. డాక్టర్లు అరెస్ట్ 

జిల్లా కేంద్రమైన భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, అబార్షన్ చేసిన ఘటనలో ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని భువనగిరి మండలం వీరవెల్లికి చెందిన తిమ్మాపురం శ్రీలతకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు. తాజాగా గర్భం దాల్చారు. తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన దనావత్ సుజాతకు పాప ఉండగా మళ్లీ గర్భం ధరించింది. వీరిద్దరు వేర్వేరుగా భువనగిరిలో ఎస్ఎల్ఎన్ఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్​లో డాక్టర్ పాండు గౌడ్ వద్ద లింగ నిర్ధారణ జరిపించుకోవడంతో గర్భంలో అమ్మాయిలే ఉన్నారని తేలింది. 

అనంతరం భువనగిరిలోని గాయత్రి హాస్పిటల్​లో డాక్టర్ హీరేకార్ శివకుమార్ (చట్టబద్దంగా ఎంబీబీఎస్ పాస్ కాలేదు) వీరిద్దరికి అబార్షన్ చేశాడు. సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఐ కుమారస్వామి తన సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున హాస్పిటల్స్ పై దాడులు నిర్వహించి అబార్షన్ చేసి వెలికి తీసిన పిండాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ శివకుమార్, డాక్టర్ పాండు  గౌడ్​ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. డాక్టర్ శివకుమార్​ను రిమాండ్​కు తరలించారు. హాస్పిటల్ ఓనర్ గాయత్రి సహా అబార్షన్ చేయించుకున్న మహిళలపై కేసు నమోదు చేశారు. కాగా మూడేండ్ల క్రితం ఇదే హాస్పిటల్(ఇప్పుడు పేరు మార్చారు)లో అబార్షన్ చేయడంతో కేసు నమోదు కావడం గమనార్హం.

అబార్షన్ కేసులో హైడ్రామా..

అబార్షన్ కేసులో హైడ్రామా నెలకొంది. సోమవారం జిల్లా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాలతి, పీవో హెచ్​ఎం, డీప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యశోద విచారణ నిర్వహించారు. హాస్పిటల్ స్టాఫ్ట్​ను ప్రశ్నించగా, ఆదివారం రాత్రి ఇద్దరికి వేర్వేరు సమయాల్లో అబార్షన్ జరిగిందని చెప్పారు. అయితే  అబార్షన్ చేయించుకున్న ఇద్దరు మహిళలు మాత్రం తమకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. 

ఒక మహిళ ఇంట్లో బాత్రూంలో జారిపడితే హాస్పిటల్​కు వచ్చానని తెలిపింది. మరో మహిళ మాత్రం తాను గర్భం ధరించలేదని చెప్పుకొచ్చింది. గత నెల తనకు నెలసరి వచ్చిందని వెల్లడించింది. అయితే డాక్టర్​గా ప్రాక్టిస్ చేస్తున్న శివకుమార్ విదేశాల్లో చదివాడని, ఎంబీబీఎస్ పాస్ కాలేదని గుర్తించారు. అబార్షన్ విషయం తనకు తెలియదని విచారణ సందర్భంగా హాస్పిటల్ ఓనర్ గాయత్రి తెలిపారు.