అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్.. జపాన్, దక్షిణ కొరియాపై ట్రంప్ 25% సుంకాలు

అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10%  టారిఫ్.. జపాన్, దక్షిణ కొరియాపై ట్రంప్ 25% సుంకాలు
  • బ్రిక్స్ విధానాలు.. మాకు వ్యతిరేకంగా ఉన్నయ్
  • ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్​లు అమల్లోకి వస్తయని వ్యాఖ్య

వాషింగ్టన్: అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.  బ్రిక్స్ విధానాలు.. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్‌‌లో పోస్ట్‌‌ పెట్టారు. ఈ అడిషనల్‌‌ టారిఫ్‌‌ల విధింపులో ఎవరికీ, ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రెజిల్​లోని రియో డి జనీరోలో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా విధిస్తున్న టారిఫ్​లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంపై ట్రంప్ ఫైర్ అయ్యారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. బ్రిక్స్​లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే, అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ విధానాలేంటో మాత్రం ట్రంప్ వివరించలేదు. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా కొత్త కరెన్సీని సృష్టించడం లేదా డాలర్‌‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని సమర్థించడం వంటి చర్యలపై బ్రిక్స్ దేశాలు చర్చించినట్లు సమాచారం.

జపాన్, కొరియాలకు టారిఫ్ లేఖలు
జపాన్, దక్షిణ కొరియాపై డొనాల్డ్ ట్రంప్ 25% సుంకాలు విధించారు. ఈ మేరకు జపాన్  ప్రధాని, సౌత్  కొరియా అధ్యక్షుడికి ఆయన టారిఫ్​  లెటర్లు పంపారు. వచ్చే నెల 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని ఆ లెటర్లలో ట్రంప్ స్పష్టం చేశారు. జపాన్, దక్షిణ కొరియాపై 25% రెసిప్రోకల్ టారిఫ్ వేసిన విషయాన్ని ట్రంప్ తన ట్రూత్  సోషల్ వేదికగా వెల్లడించారు. అమెరికాతో జపాన్, సౌత్  కొరియాల వాణిజ్యం అనుకున్నంత ఆశాజనకంగా లేదన్నారు. ‘‘జపాన్, దక్షిణ కొరియా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపైనా ఆగస్టు 1 నుంచి 25% సుంకం వేస్తం. అన్ని సెక్టోరల్ టారిఫ్​లకు ఇది అదనం. ఎగ్గొట్టే ప్రయత్నంచేస్తే అంతేమేరకు సుంకం వేస్తం. అలాగే, అమెరికాపై టారిఫ్​లు పెంచాలని నిర్ణయిస్తే, ఇప్పుడు విధించిన 25 శాతానికి అదనంగా సుంకాలు వేస్తం” అని ట్రంప్  తెలిపారు.

అమెరికావి ఏకపక్ష విధానాలు
బీజింగ్: బ్రిక్స్ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ కామెంట్లను చైనా తీవ్రంగా ఖండించింది. బ్రిక్స్ దేశాలతో ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడింది. అమెరికాతో బ్రిక్స్ ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. టారిఫ్​ల పేరుతో ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకొస్తున్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మండిపడ్డారు. టారిఫ్‌‌ విధింపు విషయంలో తమ స్పందనలో ఏ మార్పూ లేదని తెలిపారు. టారిఫ్ వార్​లో విజేతలు ఉండరనే విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని అన్నారు.

రక్షణాత్మక వైఖరితో ముందుకువెళ్లలేం అని స్పష్టం చేశారు. 10% అదనపు టారిఫ్ అనేది.. ఏకపక్ష బెదిరింపు అని తెలిపారు. ట్రంప్ నిర్ణయాలన్నీ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్​కు వ్యతిరేకంగా ఉన్నాయని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తాయని తెలిపారు. టారిఫ్​లు పెంచుకుంటూ పోతే ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించాలని చైనా భావిస్తున్నట్లు తెలిపారు.