ఆర్డర్ ​చేసిన గంటన్నరలోపు హోం మేడ్ ఫుడ్ డెలివరీ

ఆర్డర్ ​చేసిన గంటన్నరలోపు హోం మేడ్ ఫుడ్ డెలివరీ
  • గ్రేటర్​లో వందకి పైగా హోం మేడ్​ ఫుడ్ సంస్థల బ్రాంచీలు
  • కరోనా తర్వాత డిమాండ్ పెరిగిందంటున్న నిర్వాహకులు
  • కిలో నుంచి ఎంతవరకైనా అందిస్తున్న సంస్థలు 

హైదరాబాద్,వెలుగు: అచ్చం ఇంట్లో వండుకున్నట్లే సిటీలోని కొన్ని సంస్థలు ఫుడ్ ​అందిస్తున్నాయి. ఆన్​లైన్, ఫోన్లలో ఆర్డర్లు తీసుకుని హోం మేడ్ ఫుడ్ అందిస్తున్నాయి. కిలో నుంచి ఎంతవరకైనా డెలివరీ చేస్తున్నాయి. బుక్ చేసిన గంటన్నరలోపు వండి ఇంటికే పంపిస్తున్నాయి. గతంలోనే ఇలాంటి సంస్థలు ఉన్నప్పటికీ కరోనా తర్వాత హోం మేడ్ ఫుడ్​కి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ​మొదలు శివారు మున్సిపాలిటీల వరకు ఆర్డర్లు వస్తున్నట్లు సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఫుడ్ కుకింగ్ కోసం పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో వందకిపైగా ఇలాంటి హోం మేడ్ ఫుడ్ అందించే సంస్థలు ఉన్నాయి. చికెన్ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా పెంచిన నాటుకోళ్లను వాడుతున్నారు. స్పెషల్​ ఆఫర్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. రూ.5 వేలల్లో 10 మంది తినేలా కాంబో ప్యాక్ అందిస్తున్నారు. ఇందులో 2 కిలోల నాటు కోడి చికెన్, 2 కిలోల మటన్​తో పాటు మరో 8 రకాల ఐటమ్స్​ని అందిస్తున్నారు. అంకాపూర్ చికెన్, ఘర్ కా ఖానా, హోమ్ కిచెన్, మామ్ హోం మేడ్ ఫుడ్, హైదరాబాద్ హోం మేడ్ ఫుడ్ సంస్థలు సక్సెస్​ఫుల్​గా నడుస్తున్నాయి. హోం మేడ్ ఫుడ్ పేరుతో కొందరు లాభాల కోసం హోటళ్లలో ​మాదిరిగా కుక్ చేసిన ఫుడ్ ​అందిస్తున్నారని, అలాంటి రెస్టారెంట్ల విషయంలో అలర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు. 

కిలోలు, పర్సన్ల లెక్కన రేట్లు

హోం మేడ్​ ఫుడ్ ​అందిస్తున్న సంస్థలు కిలోలు లేదా తినేవారి సంఖ్యను బట్టి ఆర్డర్లు తీసుకుంటున్నాయి. నాటుకోడి చికెన్ అయితే కిలో రూ.700, బ్రాయిలర్ చికెన్ అయితే కిలోకి రూ.550, మటన్ అయితే కిలోకి రూ.1,100 తీసుకుంటున్నాయి. కాంబినేషన్ ప్యాక్​లలో అయితే ఒక్కొక్కరికి ఐటమ్స్ ని బట్టి రూ. 300 నుంచి రూ.500 వరకు రేట్లు ఉన్నాయి. ఇలా ఎన్నిరకాలుగా కావాలంటే అన్ని రకాలు కుక్ చేసి అందిస్తున్నారు. ఫుడ్​ తయారీకి పసుపు, కారం, నూనెలను సొంతంగా తయారుచేయించి వాడుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్లు పెరగడానికి అదొక కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో కొన్ని సంస్థలు ఐపీఎల్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచాయి.

ఎక్కువగా బ్యాచిలర్స్ నుంచి..

చికెన్, మటన్ ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి, కుక్​ చేసి అందిస్తున్నారు. రుచికరంగా, ఇంటి ఫుడ్ తింటున్న ఫీల్​ ఉంటుండడంతో ఆయా సంస్థలకి కస్టమర్లు రోజురోజుకు పెరుగుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​తోపాటు శివారు మున్సిపాలిటీల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్ల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కొందరు శివారు ప్రాంతాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫీసులు, ఫ్యామిలీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అధికంగా బ్యాచిలర్స్ నుంచి వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. క్యాటరింగ్ ​సర్వీస్ ​చేస్తున్న కొందరు వీరికి ఆర్డర్లు ఇస్తున్నారు. 

డైలీ 300 ఆర్డర్లు వస్తున్నయ్

సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు హోం మేడ్ ఫుడ్ అందించాలనే ఆలోచనతో 2010లో బిజినెస్​స్టార్ట్​చేశాను. తర్వాత అందరికీ అందించాలని ప్లాన్​ చేశాం. కానీ మొదట్లో తెలిసిన వాళ్ల నుంచి మాత్రమే ఆర్డర్లు వచ్చేవి. కరోనా ఎఫెక్ట్ తర్వాత ఆన్​లైన్, ఫోన్లలో ఆర్డర్లు తీసుకుని గంటన్నర లోపు ఫుడ్ ​డెలివరీ చేస్తున్నాం. ప్రస్తుతం సిటీలో 8 బ్రాంచీలు ఉన్నాయి. డైలీ 300కు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. 
‌‌–కె.సతీశ్​ రెడ్డి,  నిర్వాహకుడు,అంకాపూర్ చికెన్ ఔట్​లెట్​