పీక్ అవర్స్​లో లక్ష మందికిపైగా జర్నీ.. మెట్రో రైళ్లలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

పీక్ అవర్స్​లో లక్ష మందికిపైగా జర్నీ.. మెట్రో రైళ్లలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ
  •     ఎండలు దంచికొడుతుండటం, ట్రాఫిక్ కారణంగా మెట్రోలో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ 
  •     రైళ్లలో ఇరుక్కుని ట్రావెల్ చేస్తున్న జనం

హైదరాబాద్, వెలుగు: మండుతున్న ఎండలు, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ తిప్పల నుంచి తప్పించుకుని సిటీలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అనేకమంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఫుల్​కెపాసిటీతో తిరుగుతున్నాయి. ఏ సమయంలో చూసినా రద్దీగానే కనిపిస్తున్నాయి. పీక్​అవర్స్​అయిన ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల టైమ్​లో దాదాపు లక్షన్నర మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా సమయాల్లో 6 నిమిషాలకు ఒక ట్రైన్​నడుపుతుండగా.. పీక్ అవర్స్ లో ప్రతి 3 నిమిషాలకు ఓ ట్రైన్ నడుపుతున్నట్లు చెప్తున్నారు.

ప్రతిరోజూ నాలుగున్నర లక్షల మంది

బస్సులు, లోకల్ రైళ్లు, క్యాబ్​లు తదితర మార్గాల్లో సిటీలో ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇందులో నాలుగున్నర లక్షలమంది మెట్రోలోనే  ప్రయాణం చేస్తున్నారు. తక్కువ సమయంలో డెస్టినేషన్​కు చేరుకునే వీలుండటంతో అధికశాతం మంది మెట్రోకే ఓటేస్తున్నారు. అయితే, కొంతకాలంగా సిటీలో అన్ని రకాల కార్యకలాపాలు తిరిగి నడుస్తుండటంతో మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా  పెరిగింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైళ్లలో నిల్చోడానికి స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. స్టేషన్లలో జనం తోసుకుంటూ రైలు ఎక్కేస్తున్నారు. కొంచెం ప్లేస్ ఉన్నా ఇరుక్కుని మరీ వెళ్తున్నారు.

అన్ని కారిడార్లలోనూ..

ప్రయాణికులు పెరిగి రైళ్లలో రద్దీ ఏర్పడుతుండటంతో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని ప్యాసింజర్లు కోరుతున్నారు. ప్రతి కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పీక్ అవర్స్ లో తీవ్ర సమస్య ఏర్పడుతోంది. ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, రాయదుర్గం, అమీర్​పేట నుంచి నాగోల్, ఎల్​బీనగర్, మియాపూర్ రూట్లలో ఉదయం, సాయంత్రం విపరీతంగా రద్దీ ఉంటోంది. మెట్రో స్టేషన్లు, ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లు ఫుల్ రష్ తో కనిపిస్తున్నాయి.

పీక్ అవర్స్ లో 3 నిమిషాలకు ఒక ట్రైన్ ను నడిపిస్తున్నామని మెట్రో అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అలా జరగడంలేదని ప్యాసింజర్లు చెప్తున్నారు. నాలుగైదు నిమిషాలకు ఒక ట్రైన్​వస్తోందని, దీంతో మరింత రద్దీ ఏర్పడుతోందని కంప్లయింట్ చేస్తున్నారు. రైళ్ల రాకపోకల మధ్య సమయాన్ని మరింత తగ్గించాలని, కోచ్​లను పెంచాలని కోరుతున్నారు.

సర్వీసెస్ పెంచాలి.. 

కంపెనీలన్నీ రీఓపెన్ అయ్యాయి. ట్రాఫిక్​కి భయపడి మెట్రోలో జర్నీ చేస్తున్నాం. కానీ ఇది కూడా ఇబ్బందిగానే ఉంటోంది. సాయంత్రం అందరికీ ఒకే టైంలో డ్యూటీ అయిపోతుండటంతో రద్దీ మరింత పెరుగుతోంది. రైలు రాగానే తోసుకుంటూ ఎక్కాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో రైళ్లను పెంచితే ఈ సమస్య తీరుతుంది. - మహేశ్, ఐటీ ఎంప్లాయ్, ఉప్పల్‌‌‌‌‌‌‌‌

చర్చలు జరుగుతున్నాయ్​

ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ వద్ద సెక్యూరిటీని నియమించాం. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాం. సమస్యను అర్థంచేసుకుని ప్యాసింజర్లు ఓపికగా ఉండాలి. తోసుకోకుండా జాగ్రత్తగా ఎక్కాలి. రైళ్ల మధ్య సమయం గతంలో 5 నిమిషాలు ఉండగా.. ఇప్పుడు 3 నిమిషాలకు కుదించాం. ఈ సమయాన్ని 2 నిమిషాలకు కుదించేందుకు చర్చలు జరుగుతున్నాయి. - మెట్రో అధికారి