
- రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌తో కలెక్టర్ బిజీబిజీ
- అడిషనల్ కలెక్టర్లతోనే కొనసాగుతున్న గ్రీవెన్స్
- సమయపాలన పాటించని ఆఫీసర్లు
- ఇబ్బందుల్లో అర్జిదారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిపై అర్జిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకుందామని దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తే పై ఆఫీసర్లు ఎవరూ అందుబాటులో లేక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తొలుత అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ అందుబాటులో ఉన్నా తర్వాత ఇంపార్టెంట్పనిపై ఆయన వెళ్లిపోవడంతో కిందస్థాయి ఆఫీసర్లే ఫిర్యాదులు స్వీకరించారు. మరోవైపు గ్రీవెన్స్‌కు రావాల్సిన అధికారులు ఇన్‌టైంలో రావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌కు జిల్లా ఆఫీసర్లంతా సోమవారం ఉదయం 10గంటలకు అటెండ్ కావాలి. కానీ, ఆ సమయానికి 10 మంది అధికారులు కూడా రాలేదు. దాదాపు 60కిపైగా ఆఫీసర్లు హాజరు కావాల్సి ఉంటే 10.30 గంటలకు సగం మంది మాత్రమే అటెండ్ అయ్యారు. గ్రీవెన్స్ 10.55 గంటలకు మొదలు కాగా, 11 గంటల తర్వాత కూడా ఆఫీసర్లు ఫిర్యాదులు క్రమంగా స్వీకరించకుండా వచ్చిపోతున్నారని అర్జిదారులు వాపోయారు. కొందరు జిల్లా ఆఫీసర్లు కింది స్థాయి వారిని పంపిస్తూ డిపార్ట్మెంట్ తరఫున అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతుండగా, తీరిగ్గా జిల్లా ఆఫీసర్లు వచ్చి గ్రీవెన్స్‌లో కూర్చుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి.
పెరుగుతున్న నిర్లక్ష్యం!
కలెక్టర్ జిల్లాలోని ఆయా కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటూ అడపా దడపా గ్రీవెన్స్‌ల్లో పాల్గొంటున్నారు. అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎక్కువగా గ్రీవెన్స్‌లు కొనసాగుతున్నాయి. దీంతో కింద స్థాయి అధికారుల్లో నిర్లక్ష్యం పెరుగుతోందని, సమయపాలన పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అర్జిదారులు ఆరోపిస్తున్నారు. ఈ సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ గ్రీవెన్స్ కొనసాగిస్తున్న టైంలో ఓ ఇంపార్టెంట్ ప్రోగ్రాంతో కొంత టైం ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో హౌసింగ్ పీడీ తో పాటు ఆర్డీఓ గ్రీవెన్స్‌ను కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 60 దరఖాస్తులు రాగా, వీటిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు ఉన్నాయి. వారిలో చాలా మంది కలెక్టర్‌ను కలువలేకపోయామని, తమ సమస్య పరిష్కారం అవుతుందో.. లేదోననే అసంతృప్తితో వెనుదిరగడం కనిపించింది.