రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 అంగన్‌‌వాడీలకు సొంత బిల్డింగ్‌‌లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 అంగన్‌‌వాడీలకు సొంత బిల్డింగ్‌‌లు
  • రూ.6 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక్కో బిల్డింగ్‌‌కు రూ.12లక్షలు కేటాయింపు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 అంగన్‌‌వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్‌‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌కుమార్‌‌‌‌ ఝా చొరవతో ఇటీవల రూ.6 కోట్లు విడుదల చేసింది. జిల్లాలో 587 అంగన్‌‌వాడీ సెంటర్లు ఉండగా.. 258 సెంటర్లకు సొంత బిల్డింగ్‌‌లు ఉన్నాయి. 152 అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. తాజా నిర్ణయంతో మరో 50 అంగన్‌‌వాడీలకు సొంత భవనాలు రానున్నాయి. 

రూ. 73.20 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో 50 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.12 లక్షల చొప్పున కేటాయించనున్నారు. కొత్తగా మంజూరైన భనవాలను ఇదే ఏడాది జూన్ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో మరో 52 సెంటర్లు స్టార్ట్‌‌ చేయగా.. వీటికి ఫండ్స్ రాక మధ్యలోనే ఆగాయి. తాజాగా ఈ బిల్డింగ్‌‌లను పూర్తిచేసేందుకు రూ.3.20 కోట్లు
 మంజూరయ్యాయి. 

మారిన బిల్డింగ్‌‌ల డిజైన్.. 

అంగన్‌‌వాడీ సెంటర్ల బిల్డింగ్‌‌ల డిజైన్ మార్చారు. గతంలో 600 స్క్వైర్‌‌‌‌ ఫీట్లతో చిన్న గదులను నిర్మించగా.. కొత్త బిల్డింగ్‌‌లను 1200 స్క్వైర్‌‌‌‌ ఫీట్లకు పెంచనున్నారు. ఒక హాల్, కిచెన్, స్టోర్ రూం ఉండేలా డిజైన్‌‌ చేశారు. గతంలో చిన్న గదుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం, సరుకులు, కోడిగుడ్లు, ఇతర సామాగ్రి భద్రపరిచేందుకు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం డిజైన్ మార్చి గదుల సైజ్ పెంచడంతో సెంటర్లు విశాలంగామారనున్నాయి.

జూన్ చివరి నాటికి పూర్తి చేస్తాం

జిల్లాకు  50 అంగన్వాడీ సెంటర్ల సొంత బిల్డింగ్‌‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటిని జూన్ చివరి నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నాం. సొంత భవనాలతో అంగన్‌‌వాడీల ద్వారా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. 

లక్ష్మీరాజం, డీడబ్ల్యూవో, రాజన్న సిరిసిల్ల జిల్లా