సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే

సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే

ఒక్కో దానికి రూ.2 లక్షల వరకు రెంట్
అవన్నీ అధికార పార్టీ నేతలవేననే ఆరోపణలు
హాస్టళ్ల నిర్మాణానికి 50 శాతం ఫండ్స్ ఇస్తామన్న కేంద్రం
ప్రణాళికలు ఇవ్వని సర్కార్

హైదరాబాద్‌‌, వెలుగు: కొత్త సెక్రటేరియట్ పనులను చకచకా చేసేస్తున్న సర్కార్.. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ళను మాత్రం పట్టించుకోవడం లేదు. స్టూడెంట్లకు కనీస అవసరమైన హాస్టల్ బిల్డింగులను కట్టడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో సగం వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన గురుకులాలు కూడా రెంటెడ్ బిల్డింగులలోనే నడుస్తున్నాయి. ప్రభుత్వం వీటికి ఒక్కో దానికి నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు అద్దె చెల్లిస్తోంది. సిటీల్లో రూ.2 లక్షలు, జిల్లాల్లో అయితే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెంట్ కడుతోంది. ఇంత మొత్తం చెల్లిస్తున్నప్పటికీ, వాటిలో కనీస సౌలతులు కూడా కనిపించడం లేదు. మరోవైపు ఆ బిల్డింగులన్నీ అధికార పార్టీ నేతలవేననే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఏవైనా రిపేర్లు అవసరమైతే, ఓనర్లు అధికార పార్టీనేతలు కావడంతో వారికి చెప్పేందుకు వార్డెన్లు వెనకాడుతున్నారు.

సగం రెంటెడ్ బిల్డింగుల్లోనే…
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో సగానికి పైగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మొత్తం 1,223 ప్రీ మెట్రిక్‌,807 పోస్ట్‌‌మెట్రిక్‌ హాస్టళ్లు ఉండగా.. వాటిలో దాదాపు 4లక్షల మంది స్టూడెంట్లు ఉంటున్నారు. 278 బీసీ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లుఉంటే, అవన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. హైస్కూల్‌‌ బీసీ హాస్టల్స్‌ ‌కూడా సగం వరకు రెంటెడ్‌ ‌బిల్డింగ్స్‌‌లోనే నడుస్తున్నాయి. 669 ఎస్సీ ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌ ‌ఉంటే, వాటిలో 118 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 136 ఎస్టీ ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌‌,326 ఆశ్రమ హాస్టల్స్‌ ‌ఉండగా.. వీటిలో చాలా వరకూ అద్దె బిల్డింగులలోనే ఉన్నాయి. సర్కార్ భవనాల్లో ఉన్న హాస్టల్స్‌‌ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక ప్రభుత్వం కొత్తగా 661 ( 608 స్కూళ్లు+ 53 డిగ్రీ కాలేజీలు) గురుకులాలను ప్రారంభించింది. మొత్తం గురుకులాల సంఖ్య 959కి చేరింది. వీటిలో 2.72 లక్షల మంది చదువుకుంటున్నారు. కొత్తగా 192 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 261 బీసీ, 104 ఎస్సీ, 51 ఎస్టీ గురుకులాలు, 30 ఉమెన్ డిగ్రీ కాలేజీలు, 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ఇవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

ఒక్కో రూమ్ లో 30 మంది
ప్రస్తుతం హాస్టళ్లున్న రెంటెడ్ బిల్డింగుల్లోనూ మినిమమ్ ఫెసిలిటీస్ కనిపించడం లేదు. అనేక చోట్ల బాత్‌ రూంలు సరిగా లేవు. స్టూడెంట్లు బయటకు వెళ్తున్నారు. చాలా బిల్డింగుల్లోని రూమ్స్ కి కిటికీలు, డోర్లు కూడా లేవు. దీంతో వానకాలం వర్షంతో , చలికాలం చలితో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఐదురుగు ఉండాల్సిన రూమ్ లో 20 నుంచి 30 మందిని ఉంచుతున్నారు. చాలాచోట్ల నీళ్లుకూడా సరిగా రావడం లేదు. ఈ సమస్యలన్నీ ఓనర్లకు చెబితే.. ‘‘మా బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. వచ్చాక రిపేర్లు చేయిస్తాం” అని దాటేస్తున్నారు.

కేంద్రం ఫండ్స్ ఇస్తామన్నా…
రాష్ట్రంలో కాలేజీ హాస్టళ్లు, గురుకుల బిల్డింగుల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వీటి నిర్మాణాలకు 50 శాతం ఫండ్స్ ఇస్తామని గతంలోనే పేర్కొంది. గర్ల్స్ కాలేజీ హాస్టళ్లకు 100 శాతం ఇస్తామని చెప్పిందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. దీనిపై ప్రణాళికలు పంపించాలని కూడా కోరిందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందించలేదు. బిల్డింగులు కట్టాలని స్టూడెంట్ యూనియన్లు, వివిధ సంఘాలు పోరాడుతున్న పట్టించుకోవడం లేదు.

సెక్రటేరియట్‌‌పై ఉన్న శ్రద్ధ హాస్టళ్ల పై లేదు..
రాష్ట్రంలో సగానికి పైగా హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలో కనీస సౌలతులు కూడా లేవు. పైగా వాటికి లక్షలకు లక్షలు రెంట్ కడుతున్నారు. దీనిపై ఎన్నోసార్లు పోరాడాం. సీఎంకు కొత్త సెక్రటేరియట్‌‌పై ఉన్న శ్రద్ధ.. హాస్టళ్లు, గురుకులాలపై లేదు. పేదలు చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.
– ఆర్‌‌.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

సౌలతులులేవు..
రాష్ట్రంలోని సంక్షేమహాస్టళ్లు, గురుకులాల్లోని స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె బిల్డింగుల్లో సౌలతులు సరిగా లేవు. సొంత భవనాలు కట్టాలని ఎన్నోసార్లుకోరాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లక్షలు అద్దె కట్టే బదులు.. కొత్త బిల్డింగులు కట్టడం ఎంతోమేలు.
– ప్రవీణ్‌‌ రెడ్డి, ఏబీవీపీ సెంట్రల్‌ కమిటీ మెంబర్

For More News..

కరోనా కష్టాలతో గోల్డ్ అమ్ముకుంటున్నరు

ఈ నెల 15 నుంచి ఈ-కలెక్టరేట్

5 కోట్ల ప్రభుత్వ భూమి భార్య పేరిట పట్టా చేసిన రెవెన్యూ ఉద్యోగి