శానిటేషన్ నిర్వహణ లోపంతో పెరుగుతోన్న దోమల వ్యాప్తి

 శానిటేషన్ నిర్వహణ లోపంతో పెరుగుతోన్న దోమల వ్యాప్తి

హైదరాబాద్, వెలుగు:  సిటీలోని చాలా ప్రభుత్వ స్కూళ్లలో చెత్తను తొలగించడం లేదు. స్కూళ్లు ప్రారంభమై 15 రోజులు అవుతున్నా.. క్లీన్ చేయడం లేదు. ఇటీవల కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్కూళ్లలో నీళ్లు చేరాయి. ఎప్పటికప్పుడు క్లీన్​ చేయకపోవడంతో అవి ఇప్పుడు మురికి మడుగులుగా మారాయి. దీనికి తోడు చెత్త,  మట్టి, ప్లాస్టిక్ వాటితో కలవడంతో దుర్వాసన వస్తోంది. ఇప్పటికే  గ్రేటర్ పరిధిలో 33వేల 500ల మస్కిటో బ్రీడింగ్ పాయింట్లను బల్దియా అధికారులు గుర్తించారు.  ప్రస్తుతం చాలా స్కూళ్లలో, పరిసర ప్రాంతాల్లో మురికి నీరు, నాచు, చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నాయి.  జీహెచ్ఎంసీ వర్కర్లు వచ్చినా స్కూల్ బయటే క్లీన్  చేస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. స్కూళ్లలో మురుగు నీరు  ఉంటే.. దోమలు పెరిగి డెంగీ లాంటి సీజనల్ ఫీవర్లు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.  స్కూళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉంటే తమ పిల్లలు రోగాల బారిన పడతారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మురుగు నీటితో దుర్వాసన..

 సిటీలోని ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్ సమస్య వెంటాడుతోంది. కాంపౌండ్ లోపల పిచ్చిమొక్కలు పెరగడం, నీరు నిలిచిపోవడం, స్కూళ్ల ముందు చెత్తాచెదారంతో దోమలు, ఈగలు ముసురుతున్నాయి.  షేక్ పేట్ నాలా పరిసరాల్లోని అంబేదర్కర్ నగర్  బస్తీలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో దాదాపు 100 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కానీ ఆ స్కూల్ పరిసరాల్లో మురుగు నీటితో దుర్వాసన వస్తుంటుంది. స్కూల్ లోపల కూడా అడుగు లోతు వరకు మురికి నీరు నిలిచి నాచు పేరుకుపోయి ఉంది. అక్కడే మంచి నీటి సంపు ఉండటంతో పిల్లలు వాటర్ బాటిల్స్ తో నీళ్లు పట్టుకుంటారని స్థానికులు చెప్తున్నారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు హెడ్ మాస్టర్​ను కలిసి చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు, పేరెంట్స్ చెప్తున్నారు. ఫిలింనగర్ హై స్కూల్ ముందు కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర తోపుడు బండ్లు ఉండటంతో దోమలు, ఈగలు ఎక్కువగా ఉంటున్నాయని స్టూడెంట్లు చెప్తున్నారు. కొన్ని స్కూళ్లలో ముందు, లోపల నీరు పేరుకుపోయి ఉన్నా టీచర్లు, అధికారులు స్పందించడం లేదని, ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు పేరెంట్స్ వాపోతున్నారు.  ఇప్పటికైనా అధికారులు  స్పందించి ఆరు బయటే కాకుండా.. స్కూళ్ల లోపల కూడా క్లీన్ గా ఉంచాలని,  వానాకాలం  సీజనల్ వ్యాధుల నుంచి కాపాడాలని  కోరుతున్నారు.   

ప్రస్తుతం సీజనల్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ వరకు డెంగీ కేసులు అధికంగా వస్తాయి. లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. డెంగీకి కారణమయ్యే  దోమలు ఉదయం వేళల్లోనే ఎక్కువ ఉంటాయి. అందుకే స్కూళ్ల పరిసరాలు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. చిన్నారుల పేరెంట్స్ స్కూళ్లకు వెళ్లి పరసరాలను గమనించాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ హాస్పిటల్

ఎన్నిసార్లు చెప్పినాఅంబేద్కనగర్​లోని ప్రైమరీ స్కూల్ ముందు లోపల నీరు నిలిచి ఉంటోన్నా దీనిపై టీచర్లు స్పందించడం లేదు.సమస్య పరిష్కారించాలని కోరినా టీచర్లు, అధికారులు పట్టించుకోలేదు. ఈ స్కూల్​లో వందమందికి పైగా పిల్లలు చదువుతున్నారు. నీరు నిలిచి నాచు పేరుకున్న వైపు పిల్లలు వెళ్తే జారిపడే ప్రమాదం ఉంది.  
- నరసింహ, స్థానికుడు, అంబేద్కర్ నగర్ బస్తీ