భార్యాభర్తల గొడవ.. ఆడుకుంటూ మధ్యలోకి వచ్చిన పాపను కాలితో తన్ని.. మంచానికి బాది చంపేశాడు !

భార్యాభర్తల గొడవ.. ఆడుకుంటూ మధ్యలోకి వచ్చిన పాపను కాలితో తన్ని.. మంచానికి బాది చంపేశాడు !

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కాలితో తన్ని .. మంచానికి బాది.. పది నెలల పాపను కన్న తండ్రి కడతేర్చిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్ని భార్య ప్రశ్నించింది. భార్యతో గొడవ పడి క్షణికావేశంలో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు.

దేవునిపల్లికి చెందిన హరీష్కు భవానీతో వివాహం జరిగింది. వారికి 11 నెలల విష్ణు ప్రియ అనే పాప ఉంది. హరీష్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉన్న ఉన్న విషయం భార్యకు తెలిసింది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత నెల 18న రాత్రి ఇంటికి వచ్చిన భర్తను ఈ విషయమై ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

గొడవ జరుగుతున్న సమయంలో ఆడుకుంటూ మధ్యలోకి వచ్చిన పాపను చూసి కోపోద్రికుడైన తండ్రి హరీష్ పాపను కాలితో తన్నాడు. చిన్నారిని చేతులతో లేపి పక్కనే ఉన్న మంచానికి బాదాడు. గాయాల పాలైన చిన్నారిని పెద్దపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి తీసుకెళ్లింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

ఈ విషయం ఎవరికి చెప్పవద్దని హరీష్ భార్యను బెదిరించాడు. పాప మంచంపై నుంచి కింద పడి చనిపోయిందని అందరిని నమ్మించి ఖననం చేశాడు. ఈ మధ్యనే హరీష్పై ఫోక్స్ కేసు నమోదయింది. ఈ క్రమంలో కన్న కూతురిని హరీష్ చంపాడని భార్య భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.