- అదే రోజు గణపతి సహా ఏడుగురు
- మావోయిస్టులు లొంగిపోతారనే చర్చ
- ఆసక్తి రేపుతున్న ఇటీవలి పరిణామాలు
- అజ్ఞాతంలో ఉన్న వారితో రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ అధికారుల సంప్రదింపులు
- కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్న ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు
- మావోయిస్టుల లొంగుబాటులో ఎస్‌ఐబీ పోలీసుల విశేష కృషి
- గత రెండేండ్లలో 721 మంది లొంగుబాటు, 266 ఆయుధాలు అప్పగింత
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు రహిత తెలంగాణగా మారేందుకు రాష్ట్రం కేవలం అడుగుదూరంలోనే ఉంది. నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు మావోయిస్టు నేతల లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31తో మావోయిస్టులపై కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియనుండగా, అదే రోజు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గణపతి లొంగుబాటు లేదా అరెస్టుకు సంబంధించి మరో రెండు రోజుల్లో తెరపడనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ అధికారులు గణపతితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఆ దిశగా రాష్ట్ర పోలీస్ శాఖలో పరిణమాలు వేగంగా మారుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వారితో రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ అధికారుల సంప్రదింపులు జరుపుతుండగా..- కేంద్రం నుంచి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఆ ఏడుగురి లొంగుబాటే కీలకం
సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఎస్‌ఐబీ నిర్వహించిన ‘ఆపరేషన్ సరెండర్స్’తో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, దామోదర్, చంద్రన్న సహా పలువురు కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరి లొంగుబాటు తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన గణపతి సహా ఆయన భార్య జోడే రత్నాబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ , సికింద్రాబాద్‌కు చెందిన వార్త శేఖర్, హైదరాబాద్ కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భదాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్ మాత్రమే అజ్ఞాతంలో మిగిలి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వీరు జనజీవన స్రవంతిలో కలవాలని అప్పట్లోనే ఆయన పిలుపునిచ్చారు.
గణపతి కోసం కేంద్రం నుంచి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు
గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు తెలంగాణ ప్రాంత మావోయిస్టుల లొంగుబాటుపై రాష్ట్ర ఎస్‌ఐబీ, ఇంటర్‌స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు గణపతి లొంగుబాటుకు సంబంధించి కేంద్రం నియమించిన ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికే రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గణపతి ఆరోగ్యంతో పాటు పునరావాసం, దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్న కేసులు సహా సున్నితమైన అంశాలపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు.
ఉత్కంఠ రేపుతున్న తుది అంకం
దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా.. అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా లొంగిపోయారని, లేదంటే చనిపోయారని చూపించాల్సిందే. ఈ క్రమంలోనే 40 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గడువులోగా గణపతి జనజీవన స్రవంతిలో కలిస్తే.. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది. ఇందులో భాగంగానే గణపతి లొంగుబాటును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసుల రికార్డులో ఉన్న మరో 38 మందికి సంబంధించి నేటికీ పోలీసులకు సమాచారం లేదు. మరోవైపు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ సహా కీలక నేతలు తాము లొంగిపోలేదని.. పోలీసులే అరెస్టు చేశారని చెప్తున్నప్పటికీ.. ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి ప్రజల మధ్యకు రావడమే.
డెడ్‌లైన్ దాటితే.. తర్వాత పరిస్థితి ఏంటి..
కేంద్రం చెబుతున్న ప్రకారం.. ఈ నెల 31న మావోయిస్టులకు ‘డెడ్’లైన్ పూర్తవుతుంది. తాము అజ్ఞాతం వీడి జనం మధ్య, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కేంద్రం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలోనూ కీలక మావోయిస్టు నేతలు ఈమేరకు ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసి చెప్పారు. వీరి ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సానుకూలత రావడం, తాజాగా డెడ్‌లైన్ ముగియనున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా ఏడుగురు మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది.-- మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటులో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఐబీ పోలీసుల కృషిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.- రెండేండ్లలో 721 మంది లొంగిపోగా, 266 ఆయుధాలు అప్పగించడం విశేషం.
